పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రలు, మంచి కథలతో కూడిన చిత్రాలను ఎంచుకోవడమే ముఖ్యమని యువ నటుడు కృష్ణ బూరుగుల స్పష్టం చేశారు. జిగ్రీస్ చిత్రంతో మంచి గుర్తింపు, ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఆయన, ఇకపై కథకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొందరపడి వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిగ్రీస్ విజయం తర్వాత కృష్ణ బూరుగులకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ, పది రొటీన్ సినిమాలు చేసి తెరమరుగయ్యే బదులు నాలుగు మంచి సినిమాలు చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. కథాబలం, పాత్రకు తగిన ప్రాధాన్యత ఉన్న చిత్రాల వైపు దృష్టి సారిస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కృష్ణ బూరుగుల తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథాంశంతో రూపొందే ఓ ఎంటర్‌టైనర్ ప్రాజెక్టు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని, మరికొన్ని ఆసక్తికర కథలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం. బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆశిస్తున్నారు.
Also Read: హైదరాబాద్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు