హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2 నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2027 జనవరి 27 నుంచి 31 వరకు ఈ ప్రతిష్టాత్మక లఘు చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఫెస్టివల్ వివరాలను వెల్లడించారు. రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, వైఏటీసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, పర్యాటక శాఖ ఎండీ క్రాంతి, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ప్రతినిధి అంకురం ఉమామహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు లఘు చిత్రాలు గొప్ప వేదికగా నిలుస్తాయని ఎంపీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వాణీ ప్రసాద్ మాట్లాడుతూ, యువతను సంస్కృతి, సామాజిక బాధ్యత వైపు నడిపించే కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విభిన్న చిత్రాలు, ప్రఖ్యాత జ్యూరీ సభ్యులతో ఈ ఫెస్టివల్ యువతను ఆకట్టుకుంటుందని క్రాంతి చెప్పారు.
అంతర్జాతీయ చిత్రోత్సవ ప్రముఖులతో సలహా మండలిని ఏర్పాటు చేశామని, ఐదు రోజుల పాటు ఫిల్మ్ ఎక్స్‌పో కూడా నిర్వహిస్తామని అంకురం ఉమామహేశ్వరరావు వెల్లడించారు. తమ సంస్థ విద్యార్థులు నెలకు రెండు షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించే అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ నందన్ బాబు తెలిపారు. ఔత్సాహిక దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ఈ సీజన్ 2 కొత్త అవకాశాలను అందిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు