బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సి ఉన్న కురుక్షేత్రం ప్రాజెక్టుకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం దీనిని హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న దాదా చిత్రం తర్వాత కొరటాల శివ ప్రాజెక్టు, అనంతరం వివేక్ ఆత్రేయతో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించినా, తాజా పరిణామాలతో ఈ కాంబినేషన్ ముందుకు సాగడంపై అనిశ్చితి నెలకొంది.
వివేక్ ఆత్రేయ వినిపించిన కథ బాలకృష్ణకు తొలుత నచ్చినప్పటికీ, తుది చర్చల వేళ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని బాలయ్య సూచించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ మార్పులు చేస్తే కథలోని అసలు ఆత్మ దెబ్బతింటుందని వివేక్ ఆత్రేయ భావించడంతో, ఇద్దరి ఆలోచనల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. పరస్పర అవగాహనతోనే ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బాలకృష్ణ కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అఖండ 2 ఫలితం తర్వాత కేవలం మాస్ హంగులకే కాకుండా బలమైన కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన తనయ నందమూరి తేజస్విని కూడా కథా చర్చల్లో, ప్రాజెక్టుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ పూర్తిగా డిసెంబర్‌లో విడుదల కానున్న దాదా చిత్రంపై దృష్టి సారించారు.
మరోవైపు వివేక్ ఆత్రేయ తన తదుపరి చిత్రాన్ని రవితేజ కథానాయకుడిగా పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తులాభారం అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో రాజకీయ అంశాలు, క్రైమ్ కామెడీ, ప్రేమకథ కలగలిసి ఉంటాయని సమాచారం. బాలకృష్ణతో ప్రాజెక్టు ప్రస్తుతానికి విరామం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో తప్పకుండా బాలయ్యతో కలిసి పనిచేస్తానని వివేక్ ఆత్రేయ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read: దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో