telangana
అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ డే ఎక్స్‌పో
సూర్య కరీంనగర్ ;;నగరంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ‘SCINOVA’ పేరుతో జాతీయ సైన్స్ డే ఎక్స్‌పోను పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి గర్వకారణమైన నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన వివిధ రకాల సైన్స్ మోడల్స్, ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎక్స్‌పోను సందర్శించిన తల్లిదండ్రులకు విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరును వివరించి ఆకట్టుకున్నారు. ఇతర పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం ఈ ప్రదర్శనను సందర్శించి అక్షర విద్యార్థుల ప్రతిభను, సృజనాత్మకతను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి కల్పక్ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా విద్యార్థులు తమ ఆలోచనా శక్తికి పదును పెట్టి వినూత్నమైన మోడల్స్‌ను రూపొందించారని తెలిపారు. భవిష్యత్తులో వీరే సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో దేశానికి సేవలందిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. తమ పాఠశాలపై నమ్మకంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.