telangana
దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ
సూర్య, హుజురాబాద్:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరిని ఏకం చేసి చైతన్యపరిచిన రోజు
నవంబర్ 29 ని పురస్కరించుకొని అల్గునూరులో జరిగే దీక్ష దివస్ సభను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ రథసారధి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతుందని అన్నారు. కేసిఆర్ దీక్ష తోనే మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం అని, సకల జనులు ఏకమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. విద్యార్థుల వీరోచిత పోరాటం, కళాకారుల చైతన్య స్ఫూర్తి, అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అహింస, శాంతి మార్గంలో జరిగిన పోరాటాన్ని మహోన్నత ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను ప్రతి ఒక్కరం గుర్తించుకోవాలని, అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పోలాడి తెలిపారు. అందుకే నవంబర్ 29 దీక్షా దివస్ ను యాదిలో ఉంచుకోవాలని, దీని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని పార్టీలకతీతంగా మద్దతుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యమ కారులను గుర్తింపును వేగవంతం చేసి ప్రభుత్వం వారికి తగిన రీతిలో ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.