కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
కృష్ణా జిల్లా, మేజర్ న్యూస్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సూచించారు. ఆదివారం పామర్రులోని కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గెలుపోటముల నేపథ్యంలో ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వెంటనే గుర్తించి అడ్డుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, ప్రజలకు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేలా పోలీసు శాఖ అన్ని విధాలా భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పామర్రు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.