పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ
నందిగామ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, సిబ్బంది విధులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఏడు మండలాల్లో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహకారం అందించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.