ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు!
నందిగామ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లావ్యాప్తంగా 86.06 శాతం తుది పోలింగ్ నమోదైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కీయ వెల్లడించారు. మొత్తం 128 గ్రామ పంచాయతీల పరిధిలో 1,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3,07,582 మంది ఓటర్లకు గాను 2,64,709 మంది ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో మొదటి గంట నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 8 గంటలకు 7.47 శాతం, 9 గంటలకు 34.98 శాతం, 10 గంటలకు 52.52 శాతం, 11 గంటలకు 64.62 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 77.20 శాతం పోలింగ్ నమోదైంది. చివరకు 86.06 శాతానికి చేరుకుంది. మండలాల వారీగా పరిశీలిస్తే చందర్లపాడు 87.65 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, వీరులపాడు 87.37 శాతం, జగ్గయ్యపేట 86.85 శాతం, వత్సవాయి 86.56 శాతం, నందిగామ 86.18 శాతం, పెనుగంచిప్రోలు 84.80 శాతం, కంచికచర్ల 83.56 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.