BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి

Select Suryaa Now
అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి

విజయవాడ మేజర్ న్యూస్ : న్యాయాధికారులు తమ అంతరాత్మకు కట్టుబడి, సామాజిక మాధ్యమాల ప్రభావాలకు, బయటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా తీర్పులు వెలువరించాలని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు  న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటంలో ట్రయల్ కోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని, యువ జెన్ జీ న్యాయాధికారులు మహాభారతంలోని వికర్ణుడిలా ధైర్యంగా, నిజాయితీతో నిర్ణయాలు తీసుకుంటూ, కేసుల పరిష్కారంలో సకాలంలో న్యాయం అందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు ఆధ్వ‌ర్యంలో ఆదివారం న‌గ‌రంలోని డా. బి.ఆర్‌.అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో మూడో రాష్ట్ర‌స్థాయి న్యాయాధికారుల స‌ద‌స్సు జ‌రిగింది. స‌ద‌స్సులో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టితో పాటు రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  జ‌స్టిస్ లిసా గిల్, హైకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ నినాల జయసూర్య త‌దిత‌రుల‌తో పాటు 650 మందికి పైగా జ్యుడీషియ‌ల్ అధికారులు పాల్గొన్నారు.

స‌ద‌స్సులో రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ప్రారంభ ఉప‌న్యాసం చేస్తూ 2021లో అప్ప‌టి రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా ఆధ్వ‌ర్యంలో రెండో న్యాయాధికారుల స‌ద‌స్సు జ‌రిగింద‌ని.. అయిదేళ్ల విరామం త‌ర్వాత ఇప్పుడు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ లిసా గిల్ సార‌థ్యంలో మూడో స‌ద‌స్సు జ‌రుగుతోందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న ఈ సదస్సు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ పాత్రను పునరుద్ఘాటిస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెండింగ్ కేసుల తగ్గింపు, సత్వర న్యాయం, కోర్టులలో సాంకేతికత వినియోగం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, బలహీన వర్గాలకు న్యాయాన్ని చేరువ చేయడం వంటి కీలక అంశాలపై చ‌ర్చ‌కు, మేధోమ‌థ‌నానికి ఈ సదస్సు వేదిక‌గా నిలుస్తోంద‌న్నారు.

స‌ద‌స్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ... సామాన్య పౌరునికి రాజ్యాంగ సజీవ ఆత్మ ఢిల్లీలో కాకుండా, వారికి అత్యంత చేరువలో ఉన్న ట్రయల్ కోర్టులలోనే కనిపించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి పది కేసుల్లో దాదాపు తొమ్మిది కేసులు జిల్లా, దిగువస్థాయి న్యాయస్థానాల్లోనే ఉన్నందున, న్యాయస్థానాలు సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాల‌న్నారు. నేడు ప్రతి న్యాయస్థానానికి లక్షలాది మందితో కూడిన అదృశ్య ప్రేక్షకుల గ్యాలరీ ఉందని, విచారణలోని కొన్ని క్షణాల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ, తీర్పులు వెలువడక ముందే ఆన్‌లైన్‌లో విచారణలు, తీర్పులు జరుగుతున్న పరిస్థితులు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇటువంటి ప్రచార ప్రభావాలకు లోనుకాకుండా న్యాయాధికారులు నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ‘వేగం’ అంటే ‘తొందరపాటు’ కాదని స్పష్టం చేస్తూ, కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా, రిజర్వు చేసిన తీర్పులను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా వెలువరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను పనిచేసిన రోజులను తన జీవితంలో ‘స్వర్ణ కాలం’గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అభివర్ణిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సరస వెంకటనారాయణ భట్టి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ పురోగతి, న్యాయపరిపాలనలో న్యాయాధికారుల పాత్ర, బాధ్యతలను చర్చించుకోవడానికి ఈ స‌ద‌స్సును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విధుల‌పై ఆసక్తి, అంకితభావమే ముందుకు నడిపిస్తాయని న్యాయాధికారుల‌ను ఉద్దేశించి అన్నారు. ​మాతృ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ పనితీరు దేశంలోనే ఎవరికీ తీసిపోని విధంగా ఉందని, త‌న సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో ఎందరో గొప్ప న్యాయమూర్తుల నుండి నేర్చుకున్న విషయాలే త‌న‌ను ఈ స్థాయికి తెచ్చాయన్నారు. న్యాయమూర్తి కుర్చీ ఎంతో శక్తివంతమైనదని భవిష్యత్తులో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తీర్చిదిద్దే సత్తా దీనికి ఉందనన్నారు. కానీ.. హోదా, అధికారం తలకెక్కకుండా, మనం ఎక్కడి నుండి వచ్చామనే మూలాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు.  సాక్ష్యాల చట్టాన్ని సరిగ్గా అన్వయించుకుంటూ, అనుభవజ్ఞులైన న్యాయవాదుల వాదనలను ఓపికగా విని, నిష్పక్షపాతమైన తీర్పులు ఇవ్వాలన్నారు. యువ న్యాయాధికారులు, హైకోర్టు న్యాయమూర్తుల సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని, ప్రజలకు మనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నానన్నారు.

రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ.. "న్యాయం చెప్పడం సులభం, న్యాయం చేయడం కష్టం" అనే నానుడిని ప్రస్తావిస్తూ, న్యాయవ్యవస్థకు ట్రయల్ కోర్టుల న్యాయాధికారులే అసలైన పునాది అని పేర్కొన్నారు. "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ అప్పారావు గారి మాట‌ల‌ను చెబుతూ న్యాయస్థానాల్లో పనిచేసే వ్యక్తుల ప్రవర్తన, సాక్షులను గౌరవించే తీరు, కేసులను సత్వరమే పరిష్కరించే విధానం ద్వారానే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ-ఫైలింగ్, వర్చువల్ హియరింగ్స్ వంటి సాంకేతిక మార్పులు ఆహ్వానించదగినవే అయినప్పటికీ, అదే స‌మ‌యంలో మారుమూల గ్రామాల నుండి వచ్చే సామాన్య కక్షిదారులకు తమ కేసు ఎందుకు వాయిదా పడిందో స్థానిక భాషలో స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం అత్యంత ముఖ్యమని అన్నారు. నేడు 'ట్రయల్ బై హ్యాష్‌ట్యాగ్' పేరుతో సోషల్ మీడియా ఒత్తిడి పెరిగిందని, ఆన్‌లైన్ ట్రోలింగ్ లేదా హెడ్‌లైన్స్‌కు భయపడి న్యాయాధికారులు తమ నిర్ణయాలను మార్చుకోకూడదని సూచించారు. న్యాయాధికారులు క‌చ్చితమైన సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని.. అనవసరమైన వాయిదాలను అరికట్టి, మధ్యవర్తిత్వం వంటి మార్గాల ద్వారా పెండింగ్ కేసులను తగ్గించాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని హైకోర్టు సీజే జ‌స్టిస్ లిసా గిల్ సూచించారు. స‌ద‌స్సులో భాగంగా గౌర‌వ ముఖ్య అతిథులు ఏపీ స్టేట్ జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో హైకోర్టు స‌ర్క్యుల‌ర్లు, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు (2009-2026) డిజిట‌ల్ లైబ్ర‌రీని ఆవిష్క‌రించారు.

మేధోమ‌థ‌నానికి కేరాఫ్‌.. టెక్నిక‌ల్ సెష‌న్స్‌: రాష్ట్ర‌స్థాయి న్యాయాధికారుల స‌ద‌స్సులో రెండు టెక్నిక‌ల్ సెష‌న్స్ జ‌రిగాయి. న్యాయ ప్రాప్యత – సోషల్ మీడియా ప్రభావం – జిల్లా న్యాయవ్యవస్థ అంశంపై జ‌రిగిన తొలి సెష‌న్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ ర‌వినాథ్ తిల్హారీ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా.. హైకోర్టు మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బి. కృష్ణ‌మోహ‌న్ స‌హాధ్య‌క్షులుగా వ్య‌వ‌హరించారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశంలో సోషల్ మీడియాకు సంబంధించిన చట్టపరమైన అంశాల‌పై హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ టి.సి.డి. శేఖర్, ప్రత్యేకించి వ్యక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, న్యాయవ్యవహారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై జ‌స్టిస్ సునీత గంధం ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లా జ్యుడీషియ‌రీ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జ్ జి.శ్రీనివాస్ ప్ర‌జంటేషన్ ఇచ్చారు. 

రెండో సెష‌న్‌లో స‌కాలంలో న్యాయం-న్యాయాధికారుల పాత్ర‌పై జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశానికి హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దొనాడి ర‌మేష్ అధ్యక్ష‌త వ‌హించ‌గా జ‌స్టిస్ బి.ఎస్‌.భానుమ‌తి స‌హాధ్య‌క్షులుగా వ్య‌వ‌హరించారు. సివిల్ కేసుల‌పై జస్టిస్ సుబ్బారెడ్డి స‌త్తి ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌గా.. క్రిమిన‌ల్ కేసుల‌పై డా. జ‌స్టిస్ వై.ల‌క్ష్మ‌ణ‌రావు ప్రజంటేష‌న్ ఇచ్చారు. జిల్లా జ్యుడీషియ‌రీ నుంచి గుంటూరు ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి బి.సాయి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

ముగింపు స‌మావేశం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌స్థాయి మూడో న్యాయాధికారుల స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ లిసా గిల్‌, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత, జస్టిస్ కె. సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జిల్లా న్యాయమూర్తులే అసలైన ప్రతిరూపాలని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మొదట వారినే ఆశ్రయిస్తారని  గుర్తుచేశారు. కేవలం ఒక సాధారణ రొటీన్ పనిలా కాకుండా, జీవితంలోనూ, వృత్తిలోనూ క్రమశిక్షణ, సమతుల్యతను పాటిస్తూ, సరైన ప్రణాళికతో కేసులను సకాలంలో పరిష్కరించాలన్నారు. సమయపాలన విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, లైవ్ లింకుల ద్వారా ప్రజలు కోర్టు కార్యకలాపాలను గమనిస్తున్నందున బెంచ్‌పై సమయానికి ఉండాలని స్పష్టం చేశారు. అధికారాన్ని మీ వ్యక్తిగత గుర్తింపుగా కాకుండా వ్యవస్థకు సేవ చేసే బాధ్యతగా మాత్రమే భావించాలన్నారు. నిబంధనల పరిధిలోనే వ్యవస్థ మెరుగుదల కోసం కొత్త ఆలోచనలు చేయడానికి వెనుకాడవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సీనియర్ అధికారులను అడగడానికి సంకోచించవద్దని సూచించారు. చివరగా, సామాన్య పౌరులకు సత్వర, సరైన న్యాయం అందించడం మన రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని, అధికారులందరూ నెలవారీ చర్చా వేదికలను ఏర్పాటు చేసుకుని వృత్తిపరంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. 

సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత మాట్లాడుతూ అంశాలను బట్టీ పట్టకుండా సారాంశాన్ని గ్రహించి విధుల్లో అన్వయించుకోవాలని, కోర్టు వాయిదాల వల్ల కక్షిదారులు పడే తీవ్రమైన ఆవేదనను, ఒత్తిడిని అర్థం చేసుకోవాలని సూచించారు. న్యాయాధికారుల బాధ్యత భగవంతుడు అప్పగించిన పవిత్ర కార్యమని, పూజకు 'ముహూర్తం' ఎంత ముఖ్యమో సకాలంలో తీర్పులు ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తూ, నిరంతర సాధనతో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్ రెడ్డి మాట్లాడుతూ... సోషల్ మీడియా వల్ల మారుమూల గ్రామాల సామాన్యులు సైతం తమ కేసుల స్థితిని తెలుసుకోగలుగుతున్నప్పటికీ, సాక్ష్యాధారాల విచారణ పూర్తవ్వకముందే వాట్సాప్, యూట్యూబ్ త‌దిత‌రాల్లో 'సోషల్ మీడియా ట్రయల్స్' జరగడం న్యాయవ్యవస్థకు సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల న్యాయాధికారులు కెమెరాల కోసం తీర్పులు చెప్పకుండా, సోషల్ మీడియా ఒత్తిళ్లకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సత్వర న్యాయం కోసం సరైన కారణం లేకుండా లిఖితపూర్వకంగా నమోదు చేయకుండా కేసులను వాయిదా వేయకూడదని, బెయిల్, భరణం (మెయింటెనెన్స్), పిల్లల సంరక్షణ, సీనియర్ సిటిజన్లు, అండర్ ట్రయల్ ఖైదీల వంటి అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే విచారించాలన్నారు. కేవలం తీర్పులకే పరిమితం కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా రాజీ మార్గాల్లో కేసుల పరిష్కారానికి కూడా కృషి చేయాలన్నారు.

న్యాయాధికారులు గౌరవప్రదంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తూ సత్వర న్యాయం అందిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. స‌ద‌స్సులో అతిథులు జ్యుడీషియల్ ఆఫీసర్స్ ఇ -కార్నర్ పోర్టల్ ను కూడా ఆవిష్కరించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.