పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం
విజయవాడ మేజర్ న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసే సుమారు 100 కోట్ల మందిని సిగరెట్లకు దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) వెల్లడించింది. దుబాయ్‌లో నిర్వహించిన టెక్నోవేషన్ అంతర్జాతీయ సదస్సులో కంపెనీ ప్రతినిధులు తమ లక్ష్యాలు, శాస్త్రీయ పరిశోధనలు, పొగ రహిత ప్రత్యామ్నాయాలపై వివరించారు. 2008 నుంచి ఈ ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధనలకు 16 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 110 మార్కెట్లలో సుమారు 4.3 కోట్ల మంది వీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. 2025లో కంపెనీ నికర ఆదాయంలో 41.5 శాతం పొగ రహిత ఉత్పత్తుల నుంచే వచ్చినట్లు వెల్లడించారు. అయితే పొగాకు, నికోటిన్‌ను పూర్తిగా మానేయడమే ఆరోగ్యపరంగా ఉత్తమమైన మార్గమని, ప్రత్యామ్నాయ ఉత్పత్తులు కూడా ప్రమాదరహితమైనవి కావని స్పష్టం చేశారు. మైనర్లకు విక్రయాలపై కఠిన నియంత్రణలు పాటిస్తున్నట్లు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.