కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం, వన సమారాధనల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేసి భక్తులందరికీ సాధారణ దర్శనం కల్పించారు. స్కానింగ్ కేంద్రం వద్ద సిబ్బంది భక్తులను క్రమబద్ధీకరిస్తూ తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ కొండపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్జిత సేవా కేంద్రాలు, ఉచిత ప్రసాద పంపిణీ, చండీ హోమం, లక్ష కుంకుమార్చన నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు గుర్తించిన సమస్యలపై ఈవో వెంటనే స్పందించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి పంచహారతుల అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ధర్మపథం కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన సుమాంజలి నృత్యనిలయం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.