అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు
సూర్య - మానకొండూర్ : తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన 'దీక్షా దివస్' స్ఫూర్తి సభకు అలుగునూరు గడ్డపై జనం పోటెత్తారు. ఆదివారం నిర్వహించిన ఈ బహిరంగ సభకు ఊహించని రీతిలో ప్రజలు, గులాబీ శ్రేణులు తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ మయమైంది. మైదానం పూర్తిగా నిండిపోవడంతో, ప్రాంగణంలోకి చేరుకోలేక సభలో ఉన్నవారికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు, వాహనాలు ప్రధాన రహదారులపైనే నిలిచిపోయారు. ఈ జనసంద్రాన్ని దాటుకుని సభా వేదిక వద్దకు చేరుకోవడానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సైతం కొంత ఆలస్యమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాళేశ్వరంపై కక్ష : ఆంధ్రాకు జలదోపిడీ
తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. "నిన్నమొన్నటి వరకు లక్షణంగా వచ్చిన కరెంటు, బ్రహ్మాండంగా వచ్చిన నీళ్లకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కరోనా కంటే డేంజరస్ వైరస్ కాంగ్రెస్ మన నెత్తిమీద కూర్చుంది" అని విమర్శించారు.రెండు పిల్లర్ల సాకుతో పడావు: కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగాయనే సాకుతో ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారని, కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేస్తే కరీంనగర్‌కు నీళ్లు వస్తాయని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు. "మూడేళ్లుగా ఏం పీకారు? సుతారులు దొరకడం లేదా, మేస్త్రీలు దొరకడం లేదా, సిమెంట్ బస్తాలు దొరకడం లేదా?" అని సామాన్య రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అన్నారు.ఇంజినీర్లపై బెదిరింపులా?: ఆనాడు ఆర్. విద్యాసాగర్ రావు లాంటి తెలంగాణ ఇంజినీర్లు కష్టపడి కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను రూపొందించారని, మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులను బాగుచేసి అన్నపూర్ణగా మార్చామని గుర్తుచేశారు. అలాంటి రిటైర్డ్ ఇంజినీర్లకు 'బెల్టు ట్రీట్మెంట్' ఇస్తామని, చర్లపల్లి జైల్లో పెడతామని ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.ఆంధ్రాకు నీళ్ల తరలింపు: కేసీఆర్ మీద కోపంతో గోదావరి నీళ్లను ఆంధ్రాకు వదిలేశారని, కృష్ణా నీళ్లను 750 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు తీసుకెళ్తుంటే 70 కిలోమీటర్ల దూరంలోని పాలమూరుకు మాత్రం నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌కు బొక్కపెట్టి నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం నోరుమూసుకుని చంద్రబాబుకు చెంచాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. "కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రాకు నీళ్లు ఎత్తుకుపోయే ధైర్యం ఎవరికైనా ఉండేదా?" అని ప్రశ్నించారు.పేర్లు మారిస్తే ఊరుకోం: కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలు, గాయత్రి పంప్‌హౌస్ పేర్లను మార్చి కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, 2028లో తాము అధికారంలోకి రాగానే ఆ పేర్లను తొలగిస్తామని, సచివాలయం ముందు పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు ప్యాక్ చేసి పంపుతామని హెచ్చరించారు."ఇది మామూలు జిల్లా కాదు.. సింహగర్జన చేసిన కొదమసింహాల జిల్లా కరీంనగర్. ఈ నేల మట్టిని నుదుటి బొట్టుగా పెట్టుకుని 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు బయల్దేరిన గడ్డ అలుగునూరు" అని కేటీఆర్ అన్నారు. సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్టకథలే నిజమని భ్రమపడే ప్రమాదం ఉందని, అందుకే తెలంగాణ చరిత్రను మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. "నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు.. అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు. యాచించి కాదు.. శాసించి, ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్న రాష్ట్రం ఇది" అని స్పష్టం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పుడు 24 గంటల్లో బ్రెయిన్ డెడ్ అవుతారని ఇంటెలిజెన్స్ అధికారులు భయపెట్టినా కేసీఆర్ వెనకడుగు వేయలేదని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆరు గ్యారంటీలపై నిలదీత: అధికారులకు హెచ్చరిక
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. "రూ.4 వేల పింఛన్, తులం బంగారం, మహాలక్ష్మి రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, యువతకు మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు ఆరు నెలల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఏమయ్యాయి?" అని నిలదీశారు. రాష్ట్రంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొందరు అధికారులు, పోలీసులకు కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. "కౌంట్‌డౌన్ మొదలైంది: మరో 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. అతి చేసే ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నాం. సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తాం" అని హెచ్చరించారు.భాజపాపై విమర్శలు: అమరుల సాక్షిగా ప్రతిజ్ఞ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కరీంనగర్‌కు ఒక్క బడి కానీ, గుడి కానీ, కనీసం కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను కానీ పూర్తి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక వినిపించాలంటే గులాబీ జెండా గెలవాలన్నారు. అనంతరం అమరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నీటి హక్కులను కాపాడుకుంటామని సభికులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.సభ అధ్యక్షుడు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, టి. జీవన్ రెడ్డి, రాజేశం గౌడ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులు ఉన్నారు.