డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలో డిసెంబర్ 2వ తేదీన జిల్లా స్థాయి యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పి. నర్సింహులు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో తెలంగాణ రాష్ట్ర యువజన సేవల శాఖ మార్గదర్శకాల మేరకు వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 30వ జాతీయ యువజనోత్సవం–2027లో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.యువతలోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను వెలికితీసేందుకు ఈ యువజనోత్సవం వేదికగా నిలవనుందని తెలిపారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, జానపద గానం, చిత్రలేఖనం, కవితా రచన, నుక్కడ నాటకం అనే ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.జానపద నృత్యం, జానపద గానంలో సహాయక కళాకారులతో కలిపి ఒక్కో బృందానికి గరిష్ఠంగా 10 మందికి అవకాశం కల్పించనున్నట్లు, ప్రదర్శన సమయం 5 నుంచి 8 నిమిషాలుగా నిర్ణయించినట్లు తెలిపారు. జానపద గానంలో సినీ పాటలు, మెడ్లీ పాటలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. చిత్రలేఖన పోటీలో 'వ్యసన రహిత యువత', 'ఆరోగ్యకరమైన జీవనశైలి' అంశాలపై ఏ3 పరిమాణం కాగితంపై చిత్రాలు గీయాల్సి ఉంటుందని, ఇందుకు 90 నిమిషాల సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు.కవితా రచన పోటీలో హిందీ, ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషల్లో స్వీయ రచనతో పాల్గొనవచ్చని, ఈ పోటీకి కూడా 90 నిమిషాల సమయం ఉంటుందని తెలిపారు. నుక్కడ నాటకంలో వ్యసన విముక్తి, ప్రభుత్వ పథకాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, యువజన సంబంధిత అంశాలపై ప్రదర్శనలు ఇవ్వవచ్చని, ఒక్కో బృందంలో గరిష్ఠంగా 10 మంది పాల్గొనవచ్చని వివరించారు.నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా న్యాయనిర్ణేతలు పోటీల్లో పాల్గొన్న వారి ప్రతిభను మూల్యాంకనం చేసి విజేతలను ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పి. నర్సింహులు పిలుపునిచ్చారు.