స్ఫూర్తి.. (కథ)
స్ఫూర్తి.. (కథ)
రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
"ఏరా రామూ ఆలస్యమైందేం"? అని డ్రిల్ మాష్టారు సురేష్ అడిగేసరికి "మా రోడ్డు అంతా గతుకులు పడిపోయింది" అని రాము చెబుతుండగా "అవును సార్, భయంకరంగా గుంతలు పడి పోయి, రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళు నిలిచిపోయి, నడవటానికి చాలా ఇబ్బందిగా వుంది" అని వెంకట్ చెప్పాడు. ఇంతలో డ్రిల్ మాష్టారు సెల్ రింగ్ అయితే ఫోన్ తీసి వింటూ "సరే" సరే వస్తున్నాను" అంటూ "రేయ్ రామూ! మీ రోడ్ మీద సాగర్ పడిపోయాడుట, పద చూసొద్దాం" అంటూ బండి మీద వెళ్ళారు. వెళ్ళేసరికి రోడ్ మీద నీటి గుంతలో సాగర్ పడిపోయి వున్నాడు. కాలు నెప్పెట్టిందో ఏమో? ఏడుస్తున్నాడు. పుస్తకాల బేగ్, సైకిల్ కూడా నీళ్ళల్లో పడిపోయాయి. డ్రిల్ మాష్టారు సాగర్ ను బండి మీద ఎక్కించుకొని "రేయ్ రామూ ఆ సైకిల్ షాపు లో ఇచ్చేసి, పుస్తకాలు స్కూల్ కి తీసుకెళ్ళు. నేను వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తాను" అంటూ వెళ్ళారు మాస్టారు.
ఓ గంట పోయాక సాగర్ తల్లిదండ్రులు రోజా, సమీర్, మరికొంతమంది స్కూల్ దగ్గరకు వచ్చారు. ఈలోగా డ్రిల్ మాష్టారు సాగర్ కు కట్టు కట్టించి స్కూల్ కి తీసుకొచ్చారు. "చాలా థాంక్సండీ మాష్టారు, మా వాడిని సకాలంలో కాపాడినారు" అని సమీర్ అనగానే 'ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, ఓ పదిహేను రోజులు కట్టు తీయకూడదు, తడపకూడదు, బడికి పంపకండి"అని డ్రిల్ మాష్టారు చెబుతుంటేసరికి హెడ్మాస్టర్ రాఘవరావు "మీ వీధి వాళ్ళంతా ఆ రోడ్ బాగు చేయమని పంచాయతీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా" అని అడిగేసరికి "ఇప్పటికీ ఏడాది నుంచి వచ్చిన ప్రతీ నాయకులకీ, అధికారులకు, చెబుతూనే వున్నాం. వారం వారం జరిగే స్పందన లో కూడా అప్లికేషన్ ఇస్తూనే వున్నాం. ఏడాది నుంచి తిరుగుతూనే వున్నాం" అని సమీర్ అనగానే "నేను పత్రికల్లో ఫోటో తో సహా
న్యూస్ కూడా వేయించాను. కానీ సమస్యలు అలాగే వున్నాయి. మేం ఇబ్బందులు పడుతూనే వున్నాం'"అని డేవిడ్ చెప్పేసరికి "ఏదోటి చేసి రోడ్డును బాగు చేసుకోండి" అంటూ హెడ్మాస్టర్ వెళ్ళిపోయారు. సాగర్ ను ఇంటికి తీసుకెళ్ళారు.
ఓ పదిహేను రోజులు పోయిన తర్వాత సాగర్ స్కూల్ కి వచ్చాడు. "ఎలా ఉంది? ఎలావుంది కాలు నెప్పి? తగ్గిందా?" అంటూ అందరూ అడిగారు. "రేయ్ సాగర్! ఇలా చూస్తూ కూర్చుంటే మన రోడ్ బాగుపడదురా" అని రాము అనేసరికి, "మనమేం చేయగలం చిన్న పిల్లలం కదరా అని జాన్ అనేసరికి "రేయ్ పెద్దాళ్ళకే ఏ పనీ జరగటం లేదు మన మాట ఎవరు వింటారు? మనకెవరు పని చేస్తారు"? అని సాగర్ అనేసరికి "రేయ్ మనం అనుకుంటే ఏదైనా చేయగలం" అని రాము అంటూ "ఇలా చేద్దాం" అంటూ ఓ ఆలోచన చెప్పాడు "మనం చేయగలమా"? అని జాన్ అనేసరికి "నువ్వు గట్టిగా అనుకో ఏదైనా చేయగలవు అని మా బామ్మ నరసమ్మ చెప్పేది" అని రాము చెప్పగానే "సరే రామూ! నువ్వు చెప్పినట్లే చేద్దాం" అని సాగర్, "మరి ఎప్పుడు మొదలెడదాం?" అని జాన్ అనేసరికి
"మంచి ఇప్పుడే చేయాలి చెడ్డ పని రేపు చేయాలి అని తెలుగు మాస్టారు చెబుతుంటారు కదా, అందుకని ఈ సాయంత్రమే మనం అనుకున్న పని మొదలెడదాం" అని రాము అనగానే "సరే నువ్వు చెప్పినట్లే ఈ సాయంత్రమే పని మొదలెడదాం" అని జాన్,సాగర్ అన్నారు. ముగ్గురు దగ్గరగా వచ్చి పని ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు.
సాయంత్రం స్కూల్ విడిచిపెట్టాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ గంట పోయాక వీధిలో గోతులు పడ్డచోటుకి ముగ్గురు వచ్చారు. ముందుగా నీళ్ళు వున్న గోతులలో వీధి చివర గుట్టగా పడివున్న మట్టిని, రాళ్ళను తెచ్చి పాడేయసాగారు. నెమ్మదిగా నీళ్ళు అక్కడినుంచి వేరే చోటికి వెళ్ళసాగాయి అలా ఓ గంట కష్టపడేటప్పటికీ అలిసిపోయారు. ఆ రోడ్ మీద వెళ్తున్న పెద్దలు చూసి ఒకరిద్దరు కాసేపు వీళ్ళు చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. ఒక పెద్దాయన వీళ్ళకి కేకులు, జంతికలు తెప్పించి ఇచ్చారు. మట్టి తీస్తుంటే ఒకాయన "మా ఇంటి వద్ద మట్టి తీయకండి" అంటూ వీళ్ళ మీద అరిచాడు. మట్టిని మేము మా ఇంటికి పట్టుకెళ్ళడం లేదు. మీ గుమ్మాల్లోనే వేస్తున్నాం, రోడ్ సరిచేస్తున్నాం" అని పిల్లలు చెప్పేసరికి "అయినా సరే తీయొద్దు" అంటూ చాలా గట్టిగా మాట్లాడాడు ఆ పెద్దాయన. "రేయ్ జాన్ ఈరోజుకి ఇంక ఆపుదాం. రేపు ఆదివారం కదా రేప్పొద్దున చేద్దాం" అని రాము అనగానే "సరేరా"అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పోయారు. మర్నాడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు రాము, జాన్, సాగర్ గోతులు పడ్డచోటుకి వచ్చేసరికి అప్పటికే అక్కడికి వాళ్ళతో చదివే మరికొంతమంది వచ్చారు. అందరూ కలిసి ఎక్కడెక్కడి నుంచో మట్టి, రాళ్ళు తీసుకొచ్చి గోతులు పూడుస్తున్నారు. ఇంతలో డ్రిల్ మాష్టారు అక్కడికి వచ్చి పిల్లలందరినీ హుషారు చేస్తూ పిల్లలు చేస్తున్న పనులను సెల్ ఫోన్ లో షూట్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి "రేయ్ రామూ! మీరు చేస్తూండండి, నేను ఓ అరగంట లో వస్తాను" అని చెప్పి బజారుకెళ్లి అందరికీ టిఫిన్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇంతలో ఆ వీధిలో వుండే ఓ బ్యాంకు మేనేజర్ ప్రసాద్ "రేయ్ పిల్లలూ! మీరు చాలా మంచి పని చేస్తున్నారు" అంటూ "మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవిగో ఈ మొక్కలు తీసుకెళ్ళి మీ ఇండ్లలో వేసుకోండి" అంటూ ఓ యాభై మొక్కలు తెచ్చి ఇచ్చారు. అదే వీధిలో వుంటున్న కాలేజీ ప్రిన్సిపాల్ తిమ్మన్న వచ్చి “ఇదిగో నా వంతు సాయంగా ఓ లారీ నల్ల కంకర తెప్పిస్తున్నాను. మీరందరూ మా వీధి బాగు పడడటం కోసం చాలా కష్టపడుతున్నారు. పిల్లలకు స్నాక్స్ తెప్పించండి”
అంటూ డబ్బులు ఇస్తుండగా ఓ టిప్పర్ వచ్చి కంకర దింపింది. తిమ్మన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపేసాడు. ఇంతలో డ్రిల్ మాష్టారు తిమ్మన్న గారితో "ఇదిగో మీరు ఇచ్చిన ఓ టిప్పర్ కంకరకు బదులుగా ఈ మొక్క పట్టుకెళ్ళండి" అంటూ మొక్క ఇచ్చారు. "ఓ తట్ట మట్టి కి ఓ పూల మొక్క, తట్టలతో కంకర, రాళ్ళు కానీ ఏదైనా పట్టుకురండి, ఓ అందమైన మొక్కను పట్టుకెళ్ళండి అనే కొటేషన్ రాసి దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
నెమ్మది నెమ్మదిగా వీధిలో వుండే పెద్దవాళ్ళందరూ ఒకరొకరు అక్కడకొచ్చి బడి పిల్లలు మన కోసం ఇంత కష్టపడుతున్నారంటూ అందరూ శ్రమదానం చేయసాగారు. కొందరు వాళ్ళ స్కూటర్లకు, కార్లలోనూ పార, గునపం, తట్టలు, రాళ్ళ మూటలు ఎవరికి తోచినది వాళ్ళు తెస్తున్నారు. ఇప్పుడు రాము, సాగర్, జాన్ పని ఏమీ చేయడం లేదు. డ్రిల్ మాష్టారు పర్యవేక్షణలో వచ్చినవాళ్ళందరికీ మొక్కలు పంచుతున్నారు. అలా అలా సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి ఆ వీధిలో సుమారుగా రెండు కిలోమీటర్ల రోడ్డు బాగు పడింది. "రేయ్ రామూ! పదండి వెళదాం, మనం ఈరోజు చాలా వర్క్ చేసాం, మిగిలినది రేపు చూద్దాం" అని డ్రిల్ మాష్టారు అనగానే "సరే మాస్టారు, పదండి వెళదాం" అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి ఎనిమిది గంటలకు లోకల్ న్యూస్ చానల్స్ నందు "రోడ్లపై గోతులు పూడిచిన విద్యార్థులు" అని, "వాళ్ళ వీధిని వాళ్ళే బాగుచేసుకున్న ఘనులు" అని, "నాయకులకు, పాలకులకు, అధికారులకు బాధ్యతలు గుర్తు చేసిన పిల్లలు" అని, "గోయి పూడ్చు - మొక్క పట్టు" అని, "డ్రిల్ మాష్టారు పర్యవేక్షణలో సాహసం చేసిన బడి పిల్లలు" ఇలా రకరకాలుగా కథనాలు, వార్తలు, ఫోటోలతో రోడ్డు మీద పడిన గోతులను పూడ్చిన విషయాలను, ఆ గోతుల రోడ్ బాధితులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారోననే వివరాలు చాలా చక్కగా చూపించారు. ఇంకో ఛానల్ వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి సంబందిత నాయకులు, అధికారులు సకాలంలో స్పందించలేదని చెప్పారు.
మర్నాడు స్కూల్ జరుగుతున్న సమయంలో పంచాయతీ సెక్రటరీ గిరిబాబు, వూరి ప్రెసిడెంట్ శివనాగయ్య వచ్చి డ్రిల్ మాష్టారుతో "మీరు చాలా సాహసంతో రోడ్ మీద గోతులు పూడిపించారు. న్యూస్ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు వేరే విధంగా చెబుతున్నారు. నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారని, మీరు చేసిన పనికి మన ఎమ్మెల్యే గారూ కోపంగా వున్నార"ని అనగానే "పిల్లలు చేసిన పనికి మెచ్చుకోవడం పోయి కోపం దేనికి?. ఈ సమస్య ఆ వీధి వాళ్ళందరిదీ, వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నా"రని డ్రిల్ మాష్టారు చెబ్తుండేసరికి ఎమ్మెల్యే వెంగళరావు వచ్చారు. ఆయన వెనుక మీడియా వాళ్ళు వచ్చారు. "మాస్టారూ! మీరు, మీ పిల్లలు చేస్తున్న పని చాలా మంచిదే కానీ, ఆ పనులు చేయటానికి మేము వున్నాం కదా! మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి" అని వెంగళరావు అనగానే "చేసుకోండి మీ పని మీరే, ఎవరొద్దన్నారు?" అని రాము అన్నాడు . "రేయ్ రామూ! నువ్వు ఆగరా, చూడండి ఎమ్మెల్యే గారూ! మీరు ఈ వీధిలోంచి ఎన్ని సార్లో వెళ్ళారు మీకు అప్పుడు ఈ గోతులు కనబడలేదా? ఈ వీధిలో వుండే పెద్ద వాళ్ళు కొందరు ఈ గుంటలలో పడి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు. చాలామంది వాళ్ళ వాహనాలను నెలకి రెండుసార్లు మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తున్నారు.సైకిల్ మీద బడికెళ్ళే పిల్లలు పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని నెలా రెండు నెలలు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు ఇవేమీ మీ దృష్టికి రాలేదా"? అని డ్రిల్ మాష్టారు అడిగేసరికి "ఏవండోయ్ మాస్టారూ! ఇబ్బందులు పడుతున్నారు, నిజమే అయినా పనులు చేయటానికి ఓ పద్దతి, టైం వుంది కదా" అని వెంగళరావు అనగానే "పద్దతి అంటే ఏమిటి? టైం అంటే ఎప్పుడు?" అని సమీర్ అడిగేసరికి "చూడండి మీరు కాగితాలు రాసి, మాకు ఇవ్వాలి, మేం అధికారులకు చెప్పాలి, అప్పడు వాళ్ళు గవర్నమెంట్ గ్రాంట్ లు విడుదలయ్యాక ప్రాధాన్యతా క్రమంలో పనులు చేస్తారు" అని వెంగళరావు అనగానే "చూడండి ఇప్పటివరకూ మేం ఎన్నిసార్లు కాగితాలు ఇచ్చామో? మీ చుట్టూ, అధికారుల చుట్టూ ఏడాది నుంచి తిరుగుతూనే ఉన్నాం" అని సమీర్ అనగానే"అయ్యా ఎమ్మెల్యే గారూ! ఇంతవరకూ ఈ వీధిలో వున్న వాళ్ళందరూ చాలా బాధలు పడ్డారు. పిల్లలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ పని చేసారు. చాలామంది పెద్దలు మంచి మనసుతో ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ ఆర్ధిక సహకారం, మరికొందరు శ్రమదానం చేసి తమ వీధిని వాళ్ళు బాగుచేసుకున్నారు. ఈ విధంగా ఒకరితో ఒకరు కలుసుకొని తమ వీధిని బాగుచేసుకున్నారంటే సంతోషించాలి" అని హెడ్మాస్టర్ రాఘవరావు అనేసరికి "సరే, సరే మీరందరూ మీ సమస్యను గుర్తించి, మీరెంతవరకూ స్పందిస్తారో?నని నేను ఇట్లా మాట్లాడాను. ముఖ్యంగా ఈ పిల్లలు ముగ్గురినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే? ప్రభుత్వమే అన్ని పనులు చేయాలి. మనది కాదు బాధ్యత అనుకునేవాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వాళ్ళకి ఆలోచన కలిగించి ముందుండి నడిపించిన డ్రిల్ మాష్టారును అభినందిస్తున్నాను. ఇదే విధంగా మన నియోజకవర్గం లో వున్న సమస్యలకు పరిష్కారాలు వెతకాలనీ ప్రెసిడెంట్ లు అందరికీ చెబుతున్నాను. రోడ్లు బాగుచేసిన ఈ కార్యక్రమంలో ఖర్చులకు నావంతుగా ఇదిగో పదివేల రూపాయలు డ్రిల్ మాష్టారికి ఇస్తున్నాను. స్ఫూర్తిగా నిలిచిన ముగ్గురు పిల్లలకు పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను" అంటూ డబ్బులు తీసి పిల్లలతో ఫోటో తీయించుకున్నారు ఎమ్మెల్యే వెంగళరావు గారు. "జిందాబాద్ ఎమ్మెల్యే గారూ! జిందాబాద్" అంటూ అనుచరులు అరిచేసరికి "జిందాబాద్ నాకు కాదురా జయహో స్వచ్ఛ భారత్ అందాం" అని ఎమ్మెల్యే అనగానే "అందరూ జయహో స్వచ్ఛ్ భారత్" అంటూ అందరూ వెళ్ళిపోయారు…
రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::8247433432