సాగర కమలం.... (కథ)
సాగర కమలం.... (కథ)
రచన :: -- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
చరవాణి :: 8247433432
అదో ప్రశాంత వాతావరణంలో కనిపించే చిన్న పాటి భవనం లాంటి ఓ అందమైన కుటీరం. ఆ కుటీరానికి ఓ పక్కన పచ్చదనం విడిది చేసినట్లున్న పొలాలు ఇంకో పక్క కోరికలీడేర్చే వేంకటేశ్వరస్వామి దేవాలయం. దేవాలయం నుండి మంద్రస్వరాన వస్తోన్న సంగీత విద్వన్మణి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు వింటూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు డెబ్బదేండ్ల రామలింగం మాస్టారు.
అంతలో "గురువు గారు నమస్కారం ఎలా వున్నారు?" అని పలకరించగానే "ఎవరు? నువ్వు, నువ్వు సాగర్ కదూ! ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు?" అని రామలింగం మాస్టారు అడగ్గానే "గురువు గారూ బాగానే గుర్తుపట్టారు. నేను బాగున్నాను. మీది, అమ్మ గారి ఆరోగ్యం ఎలా వుంది?" అని సాగర్ అడగ్గానే "సాగర్ మా ఆరోగ్యాలు బాగానే వున్నాయి.
నువ్వు చాలా మారిపోయావురా? ఇప్పుడు ఏం చేస్తున్నావు?" అని రామలింగం మాస్టారు అడగ్గానే "గురువు గారూ! మీ ఆశీస్సుల వలన బాగానే వున్నాను. అమ్మ గారు పూజలో వున్నారా? ఒకసారి పిలుస్తారా?" అని సాగర్ అడగ్గానే "పూజ అయినట్టుంది వుండు పిలుస్తా"నంటూ "ఏవమ్మోయ్ సీతమ్మా! ఒకసారి బయటికి వస్తావూ?" అని అరిచేసరికి చేతిలో పుస్తకం, కళ్ళజోడు పట్టుకొంటూ "ఏమైంది స్వామీ? అంత గట్టిగా అరిచారు" అంటూ సీతమ్మ గారు బయటకొచ్చేసరికి "సాక్షాత్తూ సీతామహాతల్లిని చూస్తున్నట్లే వుందమ్మ గారూ మిమ్మల్ని చూస్తూంటే" అంటూ నమస్కరిస్తున్న సాగర్ ను చూస్తూ "ఎవరు స్వామీ! ఈ భక్తుడు?" అని సీతమ్మ అడగ్గానే "అదేనోయ్ మన సాగర్, అప్పట్లో మనింట్లో ఎక్కువగా వుంటూ, పద్యాలు, వ్యాకరణం నేర్చుకునేవాడు కదా! ఒక అబ్బాయి సన్నగా బక్కపలచగా పైకి ఎగబీలుస్తూండే ఒక అబ్బాయి అని" మాస్టారు చెబుతుండేసరికీ "ఓహ్ సాగరా? స్వామీ గుర్తొచ్చింది. ఎంత పెద్దొడివై పోయావురా? నాయనా! వుండు ఓ పదినిమిషాలు. పూజ అయిపోవచ్చింది ప్రసాదం తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది సీతమ్మ. "ఆ ఇప్పుడు చెప్పు సాగర్ పెళ్ళయ్యిందా? పిల్లలెంతమంది?" అని మాస్టారు వివరాలు అడిగేసరికి "చెబుతా మాస్టారు" అంటూ సాహిత్యంలో ప్రాచీన , ఆధునిక కవులు గురించి, వాళ్ళ రచనల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఓ పావుగంట గడిచాక సీతమ్మ గారు ప్రసాదం పట్టుకొచ్చి ఇద్దరికీ పెట్టారు. "ఇంకో అరగంటలో భోజనం వడ్డిస్తాను. సాగర్ నువ్వు కూడా తిని వెళ్ళాలి" అని సీతమ్మ గారు అంటూండగా "ఆ అన్నట్లు ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు వచ్చావో?" అని మాస్టారు అడగ్గానే "ఏమీ లేదు గురువు గారు సెప్టెంబర్ 5 వ తేదీ గురుపూజోత్సవం సందర్భంగా మేము చదువుకున్న సత్తెనపల్లి పాఠశాలలో మాకు చదువు చెప్పిన గురువులను సన్మానించుకోవాలనే ఆలోచనతో గురుపూజోత్సవం ఏర్పాటు చేసాము. మీరు ఖాళీ చేసుకుని తప్పనిసరిగా రావాలి. ఆనాడు మీ దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో? ఎలా ఉన్నారో? తెలుస్తుంది కదా! తప్పనిసరిగా మీరు రావాలి" అని సాగర్ అనగానే "తప్పనిసరిగా వస్తాను, మీరంతా అంత అభిమానంతో పిలిచి సన్మానిస్తామంటే తప్పనిసరిగా వస్తాను" అని అన్నారు మాస్టారు. మరి కాసేపు ఏవో కబుర్లు చెప్పి భోజనం చేసి సాగర్ వెళ్ళిపోయాడు. "ఆరి వీడి అసాధ్యం పాడు కాను, పెళ్ళి సంగతి చెప్పనే లేదు, సరే చూద్దాం వెళ్తాం కదా! అప్పుడు గట్టిగా అడుగుదాం" అనుకొంటూ నవ్వుకున్నారు మాస్టారు.
"ఏవోయ్ విశ్వం బావున్నావా?" అని పిలుపు వినబడే సరికి "ఆ రామలింగం మాస్టారు మీరా? రండి రండి ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు?" అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ "కూర్చోండి ముందు ఇదిగో మంచినీళ్ళు తాగండి" అని విశ్వం మాస్టారు అనగానే కూర్చుంటూ "బానే వున్నామయ్యా, మా సొంత వూరు మచిలీపట్నం కదా అక్కడే వుంటున్నాము. అబ్బాయి కోడలు హైదరాబాద్, అమ్మాయి అల్లుడు గుంటూరులో వుంటున్నారు. ఎక్కడివాళ్ళక్కడే సుఖంగా వుంటున్నాం. మీ పిల్లలు ఎక్కడ? ఏది మా చెల్లాయి శారద?"అని రామలింగం మాస్టారు అడగ్గానే "మీ చెల్లాయి వంట పనిలో వుంది. మా అబ్బాయి బెంగళూరు లో, అమ్మాయి అల్లుడు భీమవరం లో వుంటున్నారు. సరే రేపు సత్తెనపల్లి వెళ్ళాలి. సుందరీ మేడమ్ కూడా వస్తున్నారు". అని విశ్వం చెప్పగానే "మహేష్ గారు కూడా వస్తున్నారంటారా?" అని రామలింగం అడగ్గానే "ఏమోనండీ ఆయన ఎవరితోనూ అంతగా కలవడు కదా చూద్దాం" అని విశ్వం చెబుతుండేసరికి శారద బయటికి వచ్చి "అన్నయ్య గారూ బావున్నారా? వదినె గారు రాలేదా?" అని అడగ్గానే "ఆవిడ ఏదో దీక్షలో వుందమ్మా" అని చెప్పగానే "సరే అన్నయ్యా! భోజనాలు వడ్డించేసాను రండి" అంటూ లోపలికి వెళ్ళింది శారద. విశ్వం రామలింగం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసారు.
"కాసేపు అలా నడుం వాల్చి, రాత్రి బస్సుకు గుంటూరు వెళ్తాను"అని రామలింగం అనగానే "అలాగే మాస్టారు"అని విశ్వం లోపలికి వెళ్ళాడు. సాయంత్రం పడుకొని లేచిన తర్వాత వేడి వేడి టీ తాగుతూ "విశ్వం నీకు గుర్తుందా? అప్పట్లో స్కూల్ లీడర్ గా చేసాడు సాగరే కదా" అని రామలింగం అడగ్గానే "అవునండీ సాగరే ఇప్పుడు ఏం చేస్తున్నాడో?" అని విశ్వం అనగానే "ఆ సాగరేనయ్యా! మా వూరొచ్చి నన్ను రమ్మని పిలిచాడు. అప్పట్లో వాడు ఒక అమ్మాయిని ఇష్టపడేవాడు. నా దృష్టికి వస్తే గట్టిగా కేకలు పెట్టాను. తర్వాత నేను అక్కడి నుంచి బదిలీ అయిపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది?" అని రామలింగం అడగ్గానే "అవునండీ ఆ అమ్మాయి కమల అనుకుంటాను. మీరు వెళ్ళిపోయాక వాళ్ళు చదువులో పడ్డారు. పదో తరగతి లో మండలం ఫస్ట్ సాగర్, జిల్లా ఫస్ట్ కమల వచ్చారు. చదువులు అయిపోయాక ఏమైందో నాకు తెలియదు మాస్టారు" అని విశ్వం చెప్పగానే "సరే రేపు కలుస్తాం కదా! అడుగుదాం సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. బండి టయమవుతోంది" అంటూ రామలింగం మాస్టారు బయలుదేరారు.
అది సత్తెనపల్లి హైస్కూల్ పూర్వ విద్యార్ధులతో చాలా సందడిగా ఉంది. ఇరవై సంవత్సరాల క్రితం తాము చదువుకున్న బడిని తరగతి గదులను ఆశ్చర్యంగా చూసుకొంటూ, సెల్ఫీలు తీసుకొంటూ తమతో పాటు చదువుకున్న ఆనాటి తమ కలల రాణుల కోసం, హీరోల కోసం తెగ వెతుకుతూ, కుటుంబాలతో వచ్చిన కొందరు చిరునవ్వులతో పరిచయాలు, పలకరింపులు, కరచాలనాలు,
"హాయ్ బావా!" అంటూ కాగలించుకోబోతుంటే పొట్టలు అడ్డొచ్చి కొందరు, "కింద వచ్చింది" అని ఒకరు "పైన పోయిందిగా అరెకరం" అని ఇంకొకరు అనగానే "నాది ఎకరం పోయిందిగా" ఇంకొకరు అంటూంటే "పోయింది, పోయిందని బాధ పడకపోతే పోలీసు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా!" అంటూ సరోజ అనేసరికి సడెన్ గా జేబులోంచి చేయి పెట్టుకొని సురేష్ దువ్వెన తీసి దువ్వుకొంటూ "హాయ్ సరోజా! ఎలా వున్నావు?" అంటూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే "సురేష్ ఇంకా నీ అల్లరి తగ్గలేదా?" అంటూ సరోజ నవ్వుతూ అనేసరికి "ఇప్పటివరకూ హుందాగానే వున్నారండీ, మిమ్మల్ని చూడగానే అలా నాగస్వరం విన్న పాములా మెలికలు తిరుగుతున్నాడు" అని మాటలు వినేబడేసరికి "పద్మా! పరువు తీయకే?" అంటూ సురేష్ అనగానే "డాడీ! మీరు ఈ ఫోజులో భలేగా సిగ్గుపడ్తున్నారే?" అంటూ సురేష్ కొడుకు రమేష్ అనేసరికి "సురేష్ చాలు ఇంక మెలికలు తిరగటం ఆపేయ్, నీ భార్య పద్మ, కొడుకు రమేష్ చాలా బాగున్నారు, రండీ ఓ సెల్ఫీ దిగుదామం"టూ సరోజ ఫోటో తీసుకొంది. "వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం ఇప్పటికే చాలామంది వచ్చారు. ఇరవై ఏళ్ళ కిందట మనమందరం కలిసి చదువుకున్నాం. మన భవిష్యత్తుకు ఇక్కడే పునాదులేసుకున్నాం. మనకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను సన్మానించుకోటానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చిన వాళ్ళందరూ ముందుగా పేర్లు రాయించుకొని టిఫిన్ చేయండి. ఇంకొక గంటలో సభ మొదలవుతుంది" అంటూ సాగర్ మైకులో చెప్పాడు. గురువుల గురించి విద్య గురించి మంచి పాటలు, ఉపన్యాసాలు మైకులో వినపడుతుండగా అందరూ టిఫిన్లు చేస్తూ, ఎవరి హడావిడిలో వాళ్ళు వున్నారు. రామలింగం మాస్టారు భార్య సీతమ్మ గారితో వచ్చారు. విశ్వం, మహేష్, బాలయ్య, గోపాలం, మాస్టార్లు, సుందరీ, సావిత్రి మేడమ్ లు వచ్చారు. ఒకప్పుటి విద్యార్థులందరినీ పలకరిస్తూ తరగతి గదులు చూసుకొంటూ ప్రస్తుతం హెడ్మాస్టర్ ను రమణారెడ్డి తో మాట్లాడుతూ కూర్చొన్నారు వచ్చిన మాస్టార్లందరూ. సీతమ్మ , సుందరీ మేడమ్ మాట్లాడుకుంటుండగా రామలింగం మాస్టారు పైన కొత్తగా కట్టిన గదులు చూడటానికి వెళ్ళారు. ఇంకా తరగతులు మొదలవ్వలేదు. సిమెంట్ ఇసుక మూటలు చెక్క ముక్కలు చెత్తా చెదారాలతో శుభ్రం లేకుండా వున్నాయి. గదులు చూసుకొంటూ వెళ్తుండేసరికి "మరేం ఫర్వాలేదు. అందరితో పాటు నువ్వు కూడానూ, నిన్ను ఎవ్వరూ ఏమీ ఇబ్బంది పెట్టరు. నేను మనవాళ్ళకి చెప్పాను. నిన్ను జాగ్రత్తగా చూసుకోమ"ని అని మగ వ్యక్తి మాటలు వినబడగానే ఠక్కున ఆగిపోయారు రామలింగం మాస్టారు. "నేను రాను అంటే చాలా బలవంతంగా తీసుకొచ్చావు. నేను రాకపోతే ఏమవుతుంది?" అని ఆడ గొంతుక. "ఎంతకాలమైంది కమలా? నిన్ను చూసి మళ్ళీ చూస్తాననుకోలేదు. నిను చూడాలనీ, నీతో మాట్లాడాలనీ, ఎప్పటికప్పుడు అనుకుంటూనే వుంటాను. చాలా సార్లు మీ ఇంటికి వచ్చి నిన్ను కలవాలనే అనుకున్నాను, కానీ బాగోదని రాలేదు కమలా. ఇన్నాళ్ళకు కలిసావు. చాలా ఆనందంగా ఉంది నాకు" అని మగ గొంతు. రామలింగం మాస్టారు నిర్ధారించుకున్నారు వాళ్ళు సాగర్, కమల అని. వచ్చే కోపాన్ని ఆపుకుని వింటున్నారు. "ఇప్పుడు నీకు ఆనందంగా వుందా?" నవ్వుతూ కమల అడిగేసరికి "చాలా ఆనందంగా ఉంది. కానీ నిన్ను ఇలా చూస్తూంటే ఆనందంగా లేదు. ఎలా వుండేదానివి? ఇలా అయిపోయావు? కమలా" అంటూ బాధ పడసాగాడు సాగర్.
""నా తలరాత ఇలా వుంటే నువ్వేం చేస్తావు? సాగర్ బాధపడకు" అని కమల అనగానే "అసలు ఆ రోజుల్లో 'ఆ మాస్టారి' వల్లే మనం విడిపోయాం లేదంటే మనిద్దరం పెళ్ళి చేసుకునేవాళ్ళం" అని సాగర్ అనగానే "ఆ మాస్టారు" అని సాగర్ అనగానే 'అది నేనే కొద్దిగా జాగ్రత్తగా వినాలి' అనుకొంటూ శ్రద్ధగా చెవులు రిక్కించి వినసాగారు రామలింగం మాస్టారు. "నేనంటే ఎందుకంత ప్రేమ? నీకు సాగర్" అని కమల అడగ్గానే "ద్వేషించడానికి కారణాలు చెప్పొచ్చు, కానీ ప్రేమించడానికి వివరాలు వుండవు. నా మనసుకు నువ్వు నచ్చావ్, నా పక్కన నువ్వుంటే ప్రపంచాన్నే జయించినంత గర్వంగా వుండేది, ఏదైనా మనం హైస్కూల్లో చదివే రోజుల్లో మనిద్దరం క్లాసులెగ్గొట్టి తిరిగినవి, సెలవు రోజుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పాటలు ఒక్కటేమిటి? అవన్నీ మరచిపోలేను కమలా" అని సాగర్ అనగానే "మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు నన్ను" అని కమల అడగ్గానే "ఏమో ఎందుకంటే సరిగ్గా గుర్తులేదు కానీ ఆ మాస్టారు ఒకరోజు నన్ను పిలిచి చదువుకునే రోజుల్లో ఈ పని ఏమిటిరా? ఈ వయసులో మీకు అర్ధం కాని పనుల కోసం చదువు పాడుచేసుకోవద్దు. చదువు, జీవితం వేరు వేరు కాదు. ప్రేమ జీవితంలో ఒక వయసులో ఒక భాగం మాత్రమే. జీవితానికి వెలుగునిచ్చి, మనల్ని ఉన్నతులుగా నిలుపుతూ, జీవితాంతం మనతో వుండేది చదువేరా. అటువంటి చదువును చాలా పట్టుదలగా చదువు. అనుకున్నది సాధించు, ఉన్నత లక్ష్యాన్ని చేరుకో, ఉన్నత స్థితి లో స్థిరపడు, అప్పుడు నీది నిజమైన ప్రేమ అయితే నీకోసం నీ ప్రేమ వెతుక్కొంటూ వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపరు. అంటూ ఆ రోజు మాస్టారు చెప్పిన దానిని మనసులో పెట్టుకోని చదువు మీద దృష్టి పెట్టాను. అంతలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు దగ్గరకొచ్చేసాయి అప్పుడు అన్నీ వదిలేసి పరీక్షలకు చదువుకున్నాను. మరి నా సంగతి అలా వుంచితే మరి నువ్వెందుకు మాట్లాడలేదు? ఒక్క మాట చెప్పావా? సాగర్ నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ అని" సాగర్ అడగ్గానే "సరే మగాడిగా నువ్వు చేయలేని పని ఆడదాన్ని నేను ఎలా చేస్తాను? నాలుగు రోజులు బాధపడ్డాను. నీకు చెప్పినట్టే నాకు ఆ మాస్టారు చెప్పారు నిన్ను గుండెల్లో నింపుకొని ఇష్టంగా చదివాను. లక్కీగా జిల్లా ఫస్ట్ వచ్చాను" అని కమల అనగానే "సరే ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?" అని సాగర్ అడగ్గానే "ఏమో ఆధారం లేకుండా నన్నొదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మురళి" అంటూ ఏడవసాగింది. "ఏడవకు కమలా నిన్ను ఈ రూపంలో చూడడమే నాకు ఇబ్బందిగా వుంది. నువ్వు ఏడుస్తావుంటే అస్సలు చూడలేను. నువ్వు ఊ అను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అని సాగర్ అనగానే "నీకేమైనా మతి పోయిందా లేక పిచ్చెక్కిందా? నన్ను ఈ స్థితిలో పెళ్ళి చేసుకోడమేంటి? సాగర్, అయినా నీ భార్య ఒప్పుకోదు కదా" అని కమల అడగ్గానే "వుంటే కదా ఒప్పుకోవటానికి" అని సాగర్ అనగానే "అంటే ఏమిటి?" అని కమల అంటే "నేను ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు" అని సాగర్ అనగానే "ఏం ఎందుకు చేసుకోలేదు?" అని గట్టిగా కమల అడిగేసరికి "గుండెల నిండా నిన్ను నిలుపుకొని వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఆమెకు న్యాయం చేయలేననే ఆలోచనతో ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు" అని సాగర్ అనగానే "నీదెంత మంచి మనసో? సాగర్! ఈ నిర్భాగ్యురాలిని ఇంతలా ప్రేమిస్తున్నావా?" అని కమల అనగానే "నువ్వు నిర్భాగ్యురాలివి కాదు" అని సాగర్ అనగానే "నేను నిజంగా నిర్భాగ్యురాలినే, బతికినంత కాలం నన్ను ప్రేమించే నీకు దూరమైపోయాను, ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే పెళ్ళయిన మూన్నాళ్ళకే భర్తను పోగొట్టుకున్న నేను నిర్భాగ్యురాలిని కాక మరేమిటి?" అంటూ సాగర్ భుజం మీద చెయ్యి వేసి, తల పెట్టుకొని ఏడవసాగింది కమల. "ఊరుకో కమలా! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అని సాగర్ అనగానే "సాగర్ ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్ళి చేసుకోవడం మంచిది కాదు" అని కమల అనగానే "మంచిదే పద వెళ్దాం మన బంధువులు ఒప్పుకోకపోయినా, స్నేహితులు ఒప్పుకుంటారు. అప్పుడు చదువుకునే రోజులు కదా మనకు అడ్డు చెప్పారు. ఇప్పుడు మనం పెద్దోళ్ళమయినాం కదా! ఇప్పుడు ఎవరూ మనకు అడ్డు చెప్పరు" అంటూ కమల చేయి పట్టుకొని బయటకు వస్తుంటే, గంభీరంగా ఉండిపోయిన రామలింగం మాస్టారిని చూడగానే కమల చేయి వదిలేసాడు సాగర్. "వద్దు సాగర్, ఆ చేయి వదలకు, అలాగే పట్టుకో, జీవితాంతం అలాగే పట్టుకొని కమలకు తోడుగా నీడవై ఆమెకు పసుపు కుంకుమలనివ్వు" అంటూ రామలింగం వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
అంతలో మైకులో "మరి కొద్ది సేపట్లో మన గురువుల సన్మానం మొదలవుతుంది. అందరూ వేదిక దగ్గరకు రావాలి" అంటూ వినపడింది. ఒక్కొక్కరూ ఆనాటి ఈనాటి సంగతులు, వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఇప్పటి పరిస్థితులను చెప్పుకొంటూ వాళ్ళ కుటుంబాలను పరిచయం చేస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. "మేము చదువుకున్న ఈ పాఠశాల అభివృద్ధికి మా వంతుగా పది లక్షల రూపాయలు త్వరలో హెడ్మాస్టర్ గారికి ఇస్తాము" అని సెక్రటరీ నాగార్జున చెప్పి "ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది" అంటూ వచ్చిన మాస్టర్లందరినీ పేరు పేరునా పిలిచి సన్మానించారు. చివరగా రామలింగం మాస్టారును పిలవగానే మైకు తీసుకుని "చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా చూస్తుంటే మా దగ్గర చదువుకొన్న మీరందరూ సమాజంలో ఉన్నత స్థితిలో స్థిరపడ్డారంటే చాలా సంతోషం గా వుంది. ఏ మనిషి జీవితానికైనా వ్యక్తిత్వం తప్పనిసరి. ఆ వ్యక్తిత్వం మీరు చదువుకునే రోజుల్లోనే అలవర్చుకోవాలి. మీ తల్లిదండ్రులు మా మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని చదువుకోవటానికి పంపిస్తుంటారు. వారి కలలు నిజం చేయడానికి ఒక్కోసారి క్రమశిక్షణ పేరుతో మిమ్మల్ని అతిగా దండిచొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు. ఆ రోజుల్లో మీరు అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు సమాజం లో ఒక స్టేటస్, ఒక హోదా, ఒక గౌరవంతో మంచిగా జీవిస్తూ సుఖంగా ఉన్నారు. చదువే అన్నిటికీ మూలం. చదువుకునే వయసులో చదువు ధ్యాస తప్ప ఇంకేం వుండకూడదు. అప్పట్లో నన్ను చాలామంది అభిమానించారు. నేను చెప్పినట్టు విన్నారు. చాలా సంతోషం. ఈరోజున పిలిచి సన్మానించారు. చాలా సంతోషం. చివరగా నాదొక చిన్న మాట. అప్పుడు ఇప్పుడు కూడా మీ అందరి అభిమాన నాయకుడు సాగర్ గూర్చి, కమల గూర్చి ఓ రెండు నిమిషాలు చెప్పుకుందాం. ఒకరు మండలం ఫస్ట్ వస్తే, ఇంకొకరు జిల్లా ఫస్ట్ వచ్చారు. అదీ చదువు మీద వాళ్ళకున్న ప్రత్యేక శ్రద్ధ. ఏదో ఒక చిన్న విషయం మీద వాళ్ళిద్దరినీ నేను చాలా సార్లు చాలా గట్టిగా మందలించాను. పట్టుదలతో చదివారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు గాడి తప్పుతుంటుంది. మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అయినా నిబ్బరంగా నిగ్రహించుకోవాలి అదే జీవితమంటే. బాబూ! నాగార్జునా! ఒకసారి సాగర్ ను కమలను ఇలా తీసుకురా" అనగానే నాగార్జున సాగర్ ను, సరోజ కమలను స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా అందరూ ఆనందంగా అరవసాగారు. "మీరెవరు అరవొద్దు. చెప్పేది వినండి. వీళ్ళిద్దరి గురించి మీకు తెలిసినంత బాగా నాకు తెలియదు. ఆ రోజుల్లో వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ నా మీద గౌరవం తో చదువు మీద దృష్టి పెట్టారు. కానీ ఆనాటి నుంచి వాళ్ళిద్దరిలో ఆ ఆరాధనా భావం అలాగే వుండిపోయింది. కమలకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యిన కొద్ది రోజులకే మురళి చనిపోయాడు. కమల కడిగిన ముత్యంలా మిగిలిపోయింది స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా. నదులన్నీ సాగరాన్ని చేరినట్లే, ఈ కమల కూడా సాగర్ ను పెళ్ళి చేసుకొంటుంది మీ అందరి సమక్షంలో" అని ఒక్క క్షణం సభ వైపు చూసారు మాస్టారు. సభలో ఏవో గుసగుసలు, ఏదో అలజడి గమనించి "మీ అందరిలో కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు అన్నిటికీ జవాబు చెబుతా. నా మాట వినండి. అప్పుడు నా మాట మీద గౌరవంతో చదువుకొన్నారు. కాలక్రమంలో దూరమైనారు. కొన్ని పరిస్థితుల కారణంగా కమల పెళ్ళి మురళీతో అయ్యింది. కమల వాళ్ళ చుట్టాల అబ్బాయే మురళి. తండ్రి బలవంతం మీద కమల మురళీని పెళ్ళి చేసుకొంది. పెళ్ళయ్యేనాటికే మురళీ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మధ్యతరగతి వాళ్ళకి చాలా ఖరీదైన రోగాలు వస్తే దాచుకున్న డబ్బు, బంగారం, ఇల్లు, జీవితాలు అన్నీ పోయినా ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఇటువంటి ఖరీదైన రోగాలకు వైద్యం ఉచితంగానే చేస్తున్నా, పూర్తి స్థాయిలో అందరికీ అందని పరిస్థితుల్లో మురళీ దూరమైపోయాడు. విధి చాలా బలీయమైంది. విధి చేతిలో అందరూ ఆటబొమ్మలే. సరే కమల మీద విపరీతమైన ఆరాధనా భావం తో కమల కోసం ఒంటరిగా మిగిలిపోయిన సాగర్ తో కమల పెళ్ళి ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నారు. నిజమైన ప్రేమను మీరందరూ బలపరచేవారే కదా! పది కాలాలు నిలిచే ప్రేమను గెలిపించండి" అని రామలింగం మాస్టారు చెప్పగానే "ఇంకేటి? మాస్టారూ వాళ్ళిద్దరూ ఒక్కటి కావాలని రాసి పెట్టి వుంది. కాబట్టే మధ్యలో వచ్చిన మురళీ అలా వెళ్ళి పోయాడు. సరే ఇంక మాటలతో పనేం లేదు ఆ దండలందుకోండి మాస్టారూ'"అంటూ సుందరీ మేడమ్ అనగానే విశ్వం, మహేష్ మిగిలిన మాస్టార్లు దండలు తీసి సాగర్, కమలలకిచ్చారు.
"శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ అయుష్యేవేంద్రియ ప్రతితిష్ఠతి"" అంటూ రామలింగం మాస్టారు అంటూండగా సాగర్, కమల దండలు వేసుకొని వేలు పట్టుకుని అందరికీ నమస్కరిస్తుండగా పక్కనే వున్న గుడి మీద మైకులోంచి "రాయిని ఆడది చేసిన రాముడివా? గంగను తలపై మోసే శివుడివా?" అంటూ వస్తోన్న పాటను వింటూ ఆరాధనగా చూసుకోసాగారు కమల, సాగర్. ఇంకో పక్క స్టేజీ దగ్గర మైక్ లోంచి "చదువు నేర్పే గురువులకిదే వందనం" అనే పాటలు వింటూ ఆనందంగా ఫోటోలు తీసుకోసాగారు. "ఇదే నిజమైన ఆనందమైన గురుపూజోత్సవం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు" అంటూ నాగార్జున చెబుతుంటే "బై రా, బై బై రా బావా! మళ్ళీ కలుద్దాం బస్సు టైం అవుతోంది" అని కొందరు "ట్రైన్ కు వెళ్ళాల"ని కొందరు అందరూ వీడ్కోలు తీసుకొంటుండగా "మాస్టారూ మమ్మల్ని మన్నించండి. ఆ రోజు మీరు అలా గట్టిగా చెప్పారు కాబట్టే మేం ఈరోజు ఈ స్థాయిలో వున్నాం. మీ ఆశీస్సులతో మళ్ళీ ఇన్నాళ్ళకు మేము ఒకటయ్యాము. మీకు నమస్కారములు గురువు గారు" అని సాగర్,కమల , నాగార్జున మిగిలిన వారు నమస్కరిస్తుండగా "గురు అనుగ్రహం అపారంగా పొందిన మీ జీవితం సుఖప్రదంగా సాగుతుంది. వెళ్ళి రండీ"అంటూ రామలింగం సీతమ్మ దంపతులు వాళ్ళని దీవిస్తుండగా "గురుబ్రహ్మలారా వీడలేమంటూ వీడుకోలు అంటూ వెళ్ళిపోతున్నాం తప్పులుంటే మన్నించండి"
అంటూ వస్తోన్న పాటను వింటూ అందరూ వెళ్ళసాగారు ఆనందం నిండిన కళ్ళతో.
రచన :: -- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
చరవాణి :: 8247433432