గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు.
కళ్యాణదుర్గం/రాయదుర్గం: ఎన్నికల నిర్వహణతో పాటు శాంతిభద్రతలను కట్టుదిట్టంగా పరిరక్షించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మొత్తం 948 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. వీరిలో కళ్యాణదుర్గం పరిధిలో 521 మంది, రాయదుర్గం పరిధిలో 427 మంది విధులు నిర్వహిస్తున్నారు. బందోబస్తులో భాగంగా నలుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 129 మంది ఏఎస్సైలు, 430 మంది కానిస్టేబుళ్లు పాల్గొంటున్నారు. వీరికి అదనంగా 80 మంది ఏపీఎస్పీ బలగాలు, 50 మంది ఏఆర్ సిబ్బంది, 142 మంది హోంగార్డులు, 48 మంది స్పెషల్ పార్టీ సిబ్బందిని రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిరంతర గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.