వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర
కడియం, మేజర్ న్యూస్, :తుఫాను హెచ్చరికలు.. కుండపోత వర్షం.. అయినా ప్రచారానికి విరామం లేదు. ఎన్నికల ప్రచార చివరి రోజు ప్రకృతి ప్రతికూలించినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రామకృష్ణ తులసి దంపతులు కడియంలో విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్ర నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.
మంగళవారం నిర్వహించాల్సిన భారీ ర్యాలీ తుఫాను ప్రభావంతో రద్దయినప్పటికీ ప్రచారాన్ని ఆపకుండా ఎంపీటీసీ అభ్యర్థులు పెంకె రామకృష్ణ, దాసరి చంద్రకళా శేషగిరి, గుడాల వీరమణితో కలిసి గిరిజాల బాబు దంపతులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, రైతు భరోసా, మహిళా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు.
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. భారీ వర్షంలోనూ గిరిజాల బాబు దంపతులు ముందుండి ప్రచారంలో పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పాదయాత్రలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.