విద్యుత్ ఉద్యోగులకు 2.543% డీఏ మంజూరు – ఉప ముఖ్యమంత్రికి టి జీ పి ఈ జే ఏ సి నేతల కృతజ్ఞతలు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు జూలై 2026 నుంచి అమలులోకి వచ్చే 2.543% కరువు భత్యం (డి ఏ ) పెంపును ప్రభుత్వం మంజూరు చేయడంతో విద్యుత్ ఉద్యోగుల డి ఏ 19.272% నుంచి 21.815%కు పెరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ ని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో భాగంగా పి ఆర్ సి –2026 వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ని కోరడం జరిగింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగి, గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు పైగా నమోదైనప్పటికీ, ట్రాన్స్ కో 'జెన్ కో 'డిస్కమ్ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు సమిష్టి కృషితో నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రైతులకు, గృహ వినియోగదారులకు, పారిశ్రామిక సంస్థలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల సేవలను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జే ఏ సి నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధికి, ప్రజలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని వివరించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీపేజాక్ కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, 1104 ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ వజీర్, సదానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.