లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : మురసు తుఫాను నేపథ్యంలో లోతట్టు, కొండవాలు ప్రాంతాలు, ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. బుధవారం సాయంత్రం ఏపీఐఐసీ కాలనీ, భారతి నగర్, శ్రీనివాస నగర్, బ్యాంక్ కాలనీ, వంటకాలవ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, సింగ్‌నగర్ పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి నీటి నిల్వలు, వాటి తొలగింపునకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మోటార్లకు అదనంగా రెట్టింపు సంఖ్యలో ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసి రహదారులపై నిలిచిన నీటిని వేగంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. పంట కాలువ రోడ్డుతో పాటు ప్రధాన మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్కలను తొలగించాలని సూచించారు. బీఆర్టీఎస్ రోడ్డులోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. బుడమేరు ప్రవాహ పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గోపాలకృష్ణమూర్తి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.