15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విదేశాల్లోని భక్తులకు చేరాయని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 25 వరకు 15 రోజుల వ్యవధిలో అమ్మవారి దివ్య అలంకారాలు, ప్రత్యక్ష ప్రసారాలు, విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో 2.29 కోట్ల మంది వీక్షించారని వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 42.5 లక్షలు, యూట్యూబ్‌లో 25.7 లక్షలకు పైగా వీక్షణలు నమోదయ్యాయని వివరించారు. యూట్యూబ్‌లో ప్రసారమైన రోజువారీ అలంకార దర్శనాలు, శత చండీ యాగం, లక్ష కుంకుమార్చన ప్రత్యక్ష ప్రసారాలకు విశేష స్పందన లభించిందని, ఒక్కో అలంకార దర్శనానికి సగటున 33 వేల నుంచి 57 వేల వరకు వీక్షణలు వచ్చాయని తెలిపారు. నగరకోత్సవ ఊరేగింపులో గిరిజన ధింసా నృత్యం, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, దసరా కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, కృష్ణానది పవిత్ర నవ హారతులు, తెప్పోత్సవం వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. క్షేత్రానికి ప్రత్యక్షంగా రాలేని భక్తులు కూడా డిజిటల్ వేదికల ద్వారా అమ్మవారి విశేష పూజలను వీక్షించి పునీతులయ్యారని తెలిపారు. దేవస్థానం విశేషాలను సంప్రదాయ ఎలక్ట్రానిక్, ముద్రణ మాధ్యమాలతో పాటు అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తామని చైర్మన్, ఈవో వెల్లడించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.