కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రానున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు, భగినీ హస్తభోజనం సందర్భంగా నిర్వహించే అమ్మవారి గాజుల అలంకారోత్సవం, వార్షిక భవానీ దీక్ష ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం పరిపాలనా భవనంలో ఈవో వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఈఈ రమాదేవి, ఏఈవోలు చంద్రశేఖర్, సుధారాణి, రమేష్ బాబు, గంగాధర్, తిరుమలేశ్వరరావు, లక్ష్మీ ప్రసన్న, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆకాశదీపం, నిత్య అభిషేకాలు, బిల్వార్చనలు, కార్తీక పౌర్ణమి నాటి కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నవంబర్ 11న భగినీ హస్తభోజనం సందర్భంగా అమ్మవారికి నిర్వహించే విశేష గాజుల అలంకారోత్సవ దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రసాద వితరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షాధారణలు, డిసెంబర్ 24న జరిగే కలశజ్యోతి మహోత్సవం, డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు జరిగే దీక్షా విరమణల ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భవానీ భక్తులకు కేశఖండనశాలలు, స్నానఘట్టాలు, తాగునీరు, నిరంతర అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నిల్వలు, హోమగుండాల వద్ద భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమష్టి బాధ్యతగా పనిచేయాలని ఈవో ఆదేశించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.