రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
విజయవాడ మేజర్ న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. గురువారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, విజయవాడ రూరల్ మండలం పాతపాడు పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో మాట్లాడి పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిందని, రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నామని, అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, రిసెప్షన్ కేంద్రాల్లో లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత భద్రపరుస్తామని వివరించారు. తాను సందర్శించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్‌లలోనూ నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకుడు వి. అభిషేక్‌తో కూడా ఎన్నికల సరళిపై చర్చించారు. పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.