ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మచిలీపట్నం మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో రిసెప్షన్ కేంద్రాలకు చేరుకున్న అనంతరం వాటిని స్వీకరించి భద్రపరిచే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది కేంద్రంలోకి ప్రవేశించే మార్గాలు, ఎన్నికల సామగ్రి అప్పగించే విధానం, స్వీకరణ కౌంటర్లు, సిబ్బందికి కేటాయించిన విధుల ప్రాంతాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని భద్రపరిచే ప్రదేశాలను తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిసెప్షన్ కేంద్రానికి చేరుకునేలా స్పష్టమైన లేఅవుట్ ఏర్పాటు చేయాలని, ప్రతి దశలోనూ క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని సంబంధిత సిబ్బంది నుంచి జాగ్రత్తగా స్వీకరించి, నిర్దేశించిన విధానాల ప్రకారం రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. సామగ్రి స్వీకరణ, పరిశీలన, అప్పగింత ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రిసెప్షన్ కేంద్రంలో తగినంత మంది సిబ్బందిని నియమించడంతో పాటు అవసరమైన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, లైటింగ్ వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బంది, అధికారులు, ఇతర సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన భోజన వసతులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భోజన పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల సంఖ్య, సిబ్బందికి సకాలంలో ఆహారం అందించే విధానం, పంపిణీ సమయంలో రద్దీ ఏర్పడకుండా తీసుకున్న చర్యలను సమీక్షించారు. అవసరమైతే అదనపు భోజన కౌంటర్లు ఏర్పాటు చేసి, ఎవరూ ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల సామగ్రి స్వీకరణ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎల్డీవోలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎన్నికల సామగ్రి స్వీకరణ, భద్రపరిచే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.