హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’
ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్; నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ మహా సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యాదవ సోదర సోదరీమణులందరికీ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవుల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, వీరత్వం మరియు ఐక్యతకు సదర్ ఉత్సవాలు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రులు & ప్రజాప్రతినిధులు: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్. జాతీయ ప్రముఖులు: బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఉత్తరప్రదేశ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఎంపీలు & ఎమ్మెల్సీలు: ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ అధ్యక్షుడు & ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిర్వాహకులు: శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన యాదవ సంఘాల ప్రతినిధులు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన యాదవ సోదరులు, దున్నపోతుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం కోలాహలంగా మారింది.