దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు
విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో దీపావళి సందర్భంగా నవంబర్ 7, 8 తేదీల్లో బాణసంచా విక్రయాలకు లేబర్ కాలనీ గ్రౌండ్స్, సితార సెంటర్, మాకినేని బసవపున్నయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, సింగ్‌నగర్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు విక్రయదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. స్టాల్స్ ఏర్పాటుకు నవంబర్ 5, 6 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్కిల్-2 కార్యాలయంలోని ఎస్టేట్ విభాగంలో దరఖాస్తులు పొందవచ్చని, సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఒక్కో స్టాల్‌కు దరఖాస్తు రుసుము రూ.25 వేలు, 18 శాతం జీఎస్టీ రూ.4,500 కలిపి మొత్తం రూ.29,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో స్టాల్స్ కేటాయిస్తామని వెల్లడించారు. ఇతర వివరాలకు సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎంసీహెచ్ పాఠశాల పక్కన ఉన్న నగరపాలక సంస్థ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.