భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
22-ఏ జాబితా నుంచి కాలనీలను తొలగించాలి.
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల రెవెన్యూ సమీక్ష సమావేశం జరిగింది. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని భూ సమస్యలను ప్రస్తావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ సర్వే నంబరు 100పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రశాంత్‌నగర్ వాసులకు ఇబ్బందులు కలగకుండా మానవతా దృక్పథంతో పరిష్కారం చూపాలని కోరారు. ఎల్లమ్మబండ సర్వే నంబరు 336లో సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థుల కోసం కేటాయించిన నాలుగు ఎకరాల్లో పాఠశాల భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు.నానక్‌రాంగూడ సర్వే నంబరు 49, గోపన్‌పల్లి సర్వే నంబరు 262, సర్వే నంబరు 24లో భూ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల పరిధిలోని పలు కాలనీలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే గాంధీ ప్రస్తావించిన అంశాలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. 22-ఏ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి వాటిని పరిరక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.