|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 08:20 PM
రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులపై ఆశ.. భర్తను వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన. వెరసి పక్కా సినిమా స్టైల్ మర్డర్ ప్లాన్. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో కలకలం రేపిన పట్టాటి రమేష్ హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు చూస్తుంటే పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. కేవలం అక్రమ సంబంధం కోసం మాత్రమే కాకుండా.. భర్త చనిపోతే వచ్చే భారీ బీమా సొమ్ముతో ప్రియుడితో కలిసి జల్సా చేయవచ్చననే భార్యే కిరాతకంగా భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళితే.. బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ (35), సౌమ్య దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సౌమ్య ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తుండగా.. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త రమేష్, వారిద్దరినీ పిలిచి గట్టిగా హెచ్చరించాడు. తమ సుఖానికి అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని సౌమ్య, దిలీప్ పథకం వేశారు. రమేశ్ పేరు మీద సుమారు రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. రమేశ్ చనిపోతే ఆ డబ్బుతో జల్సా చేయవచ్చని, వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవచ్చని సౌమ్య, దిలీప్ పక్కా ప్లాన్ వేశారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరిస్తేనే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించి.. 'హార్ట్ ఎటాక్' డ్రామాకు తెరలేపారు.
గత నెల 20న నిందితులు ప్లాన్ అమలు చేశారు. రమేష్‌కు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకునేలా చేశారు. ఆ తర్వాత సౌమ్య, దిలీప్ కలిసి టవల్‌తో రమేష్ గొంతు నులిమి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం రమేష్ గుండెపోటుతో చనిపోయాడని సౌమ్య పెద్ద పెట్టున రోదిస్తూ అందరినీ నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది. అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై కొన్ని గాట్లు ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉంటున్న రమేష్ తమ్ముడు కేదారికి సమాచారం ఇచ్చారు. అన్న మరణంపై అనుమానం వచ్చిన కేదారి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగంలోకి దిగి సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నివేదికలో అది సహజ మరణం కాదు, హత్య అని తేలింది.
పోలీసుల విచారణలో సౌమ్య, దిలీప్ తమ నేరాన్ని అంగీకరించారు. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని పారిపోవాలనే ఆలోచనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. ఈ కేసులో సౌమ్య, దిలీప్‌తో పాటు వీరికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల బంధాన్ని, ముగ్గురు పిల్లల భవిష్యత్తును కాలరాసి ప్రియుడి కోసం భర్తను చంపిన సౌమ్యకు కఠిన శిక్ష పడాలని బొర్గాం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.