|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 08:38 PM
సంక్రాంతి పండుగ వేళ భాగ్యనగరం నుంచి సొంత ఊర్లకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఈసారి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ తప్పనుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ వినూత్నంగా 'బూస్టర్ లేన్ల'ను ప్రవేశపెడుతోంది. సాధారణంగా పండుగ సమయాల్లో శంషాబాద్, బొంగులూరు, పెద్ద అంబర్‌పేట్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఈ మూడు ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా బూస్టర్ బారియర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోవచ్చు. ప్రతి టోల్ ప్లాజాలో ఇందుకోసం రెండు ప్రత్యేక లేన్లను కేటాయించారు.
పండుగ రోజుల్లో ఓఆర్ఆర్ పై వాహనాల తాకిడి ఊహించని విధంగా ఉంటుంది. శంషాబాద్ మార్గంలో సాధారణ రోజుల్లో 35 వేల వాహనాలు తిరుగుతుంటాయి. పండుగ సమయంలో కేవలం మూడు గంటల వ్యవధిలోనే లక్షన్నర వాహనాలు వస్తుంటాయి. పెద్ద అంబర్‌పేట్ వద్ద సాధారణంగా 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తే.. పండుగ వేళ ఆ సంఖ్య 90 వేలకు చేరుతుంది. బొంగులూరు సమీపంలో వాహనాల సంఖ్య సాధారణ రోజుల కంటే మూడు రెట్లు పెరుగుతుంది. ఈ భారీ రద్దీని తట్టుకునేందుకు ప్రస్తుతమున్న 12 నుంచి 15 టోల్ బూత్‌లు సరిపోవడం లేదని గుర్తించిన అధికారులు, ఈ బూస్టర్ లేన్లను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
మరోవైపు.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. జనవరి 9 నుంచి 14 వరకు, జనవరి 16 నుంచి 18 వరకు టోల్ వసూలు నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుందని, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్ణయాలు అమలైతే గంటల తరబడి టోల్ గేట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు క్షేమంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.