|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:08 PM
తెలంగాణ నీటి హక్కుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జల వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి, రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గురువారం ప్రజాభవన్‌లో ప్రభుత్వం నిర్వహించిన ‘నీళ్లు-నిజాలు’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన పునాది అయిన 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదాన్ని కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు 'మరణశాసనం' రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో, కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలంటూ కేసీఆర్ సంతకం చేశారు. దీనివల్ల ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. ఇది తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడమే. వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు 71 శాతం వాటా దక్కాలి. కానీ కేసీఆర్ కేవలం 34 శాతానికి అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు" అని రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. "ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పెట్టిన సంతకాలే తెలంగాణ పాలిట మరణ శాసనంగా మారాయి" అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. జూరాల ప్రాజెక్టు విషయంలో వీళ్లిద్దరినీ ఉరి తీసినా తప్పులేదు... ఇలాంటి వాళ్లను మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని వ్యాఖ్యానించారు.