|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:37 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పరిపాలన సంస్కరణల్లో భాగంగా పోలీసు శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనికతకు అనుగుణంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న మూడు కమిషనరేట్ల స్థానంలో ఇకపై నాలుగు కమిషనరేట్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ) సేవలందించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నూతన విధానంలో కమిషనరేట్ల పరిధిని ప్రభుత్వం స్పష్టంగా విభజించింది. అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి కీలక ప్రాంతాలతో హైదరాబాద్ కమిషనరేట్ కొనసాగనుండగా.. ఐటీ హబ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలతో సైబరాబాద్‌ను మార్పు చేశారు. కీసర, షామిర్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలతో కొత్తగా 'మల్కాజిగిరి' కమిషనరేట్‌ను.. చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం వంటి ప్రాంతాలతో 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి, ప్రత్యేక ఎస్పీ నేతృత్వంలో జిల్లా పోలీసు యూనిట్‌గా మార్చారు.