|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 07:19 PM
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. అయితే.. ఈ ఆనందం వెనుక 'చైనా మాంజా' రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలో చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఆయన ఒక వినూత్నమైన బహుమతిని ప్రకటించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని తనకు లేదా అధికారులకు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఇలా నిజమైన సమాచారం అందించిన వారికి తన సొంత నిధుల నుండి 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేస్తానని ఆయన వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై పోలీసుల ద్వారా కఠినమైన కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
చైనా మాంజా అనేది సాధారణ దారం కాదు. ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది. దీనికి పదును పెంచడానికి గాజు పొడిని ఉపయోగిస్తారు. సాధారణ దారం గాలిపటం తెగినప్పుడు మధ్యలో తెగిపోతుంది.. కానీ చైనా మాంజా అంత సులభంగా తెగదు. ఆకాశంలో ఎగిరే పక్షుల రెక్కలు ఈ దారానికి తగిలి తెగిపోతాయి. ఏటా వేల సంఖ్యలో పక్షులు ఈ మాంజా వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులకు ఈ దారం మెడకు చుట్టుకుని గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గొంతు కోసుకుపోయి మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ దారంలో లోహపు కణాలు ఉండటం వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. పర్యావరణ రీత్యా కూడా చైనా మాంజా చాలా హానికరం. సాధారణ నూలు దారం మట్టిలో కలిసిపోతుంది.. కానీ ఈ సింథటిక్ దారం వందల ఏళ్లయినా భూమిలో కరగదు. చెట్లపై, భవనాలపై చిక్కుకుపోయిన ఈ దారం పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారుతోంది. జాతీయ హరిత ట్విబ్యూనల్ (NGT) ఇప్పటికే దీనిపై నిషేధం విధించినప్పటికీ.. కొందరు వ్యాపారులు రహస్యంగా విక్రయిస్తున్నారు. అందుకే... ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దీన్ని అరికట్టగలమని ఎమ్మెల్యే భావించారు.
కేవలం చట్టాలు చేస్తే సరిపోదని.. ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖైరతాబాద్ ప్రజలతో పాటు పర్యావరణ ప్రేమికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి తన సొంత సొమ్మును బహుమతిగా ప్రకటించి మరీ ప్రజల ప్రాణాలను కాపాడాలని చూడటం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వినూత్న ప్రయత్నం వల్ల వ్యాపారుల్లో భయం మొదలవుతుందని.. తద్వారా చైనా మాంజా విక్రయాలు తగ్గుముఖం పడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సాధారణ దారాన్ని మాత్రమే కొనివ్వాలని.... పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.