|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 01:59 PM
హైదరాబాద్ నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసిన వార్షిక నేర నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024తో పోలిస్తే 2025లో మొత్తం క్రైమ్ రేట్ 15 శాతం మేర తగ్గుముఖం పట్టిందని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు.శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు. నివేదిక ప్రకారం, 2024లో 35,944 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 30,690కి తగ్గింది. అయితే, ఇదే సమయంలో మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయి. 2024లో 2,482 కేసులు నమోదు కాగా, 2025లో 2,625 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా భర్త, వారి బంధువుల నుంచి వేధింపులకు సంబంధించిన కేసులు 31 శాతం పెరిగి 813 నుంచి 1,069కి చేరాయి. మరోవైపు అత్యాచార కేసులు 31 శాతం తగ్గి 584 నుంచి 405కు పడిపోవడం గమనార్హం.అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోక్సో) కింద నమోదైన కేసులు ఏకంగా 27 శాతం పెరిగాయి. 2024లో 449గా ఉన్న ఈ కేసుల సంఖ్య, 2025 నాటికి 568కి చేరింది.మహిళలపై కేసులు పెరగడంపై కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ, "గతంలోలా కాకుండా ఇప్పుడు మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వారిలో అవగాహన పెరిగింది. అందుకే కేసుల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోంది. మేము ప్రతి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం," అని వివరించారు.