|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:42 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ డ్రోన్ల సమూహం తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ వెల్లడించారు."ఈ విషయం నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఈ రోజు ఉదయాన్నే అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చెప్పారు. తనపై దాడి జరిగిందని ఆయన అన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.. నాకు చాలా కోపంగా ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ దాడి వార్త అబద్ధం అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అంగీకరించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరని, కానీ ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి పనులు చేయడానికి ఇది సరైన సమయం కాదని ట్రంప్ పేర్కొన్నారు.