|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:17 PM
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విక్రయించే పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందంటూ ఓ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే, ఇటీవల ఆలయాన్ని సందర్శించిన దంపతులు పులిహోర ప్యాకెట్ కొనుగోలు చేశారు. ప్యాకెట్ తెరిచిన తర్వాత అందులో ఓ చిన్న నత్త కనిపించిందని, దీనిపై సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ ఆరోపణలను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎన్. సుజాత తీవ్రంగా ఖండించారు. ఇది ఆలయంపై దుష్ప్రచారం చేసే కుట్రలో భాగమేనని ఆమె అన్నారు. "వంటశాలలో అత్యధునిక యంత్రాలతో పులిహోర తయారు చేస్తాం. ఒకవేళ అందులో నత్త పడితే దాని గుల్ల నలిగిపోతుంది. కానీ, వీడియోలో నత్త చెక్కుచెదరకుండా ఉంది. ప్రసాదం కొన్న తర్వాత బయట ఎవరైనా దాన్ని అందులో వేసి ఉండవచ్చు" అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు 15 వేలకు పైగా పులిహోర ప్యాకెట్లు విక్రయించగా, మరెక్కడా ఇలాంటి ఫిర్యాదు రాలేదని ఆమె స్పష్టం చేశారు.