|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:02 AM
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయనేనని ఘాటుగా విమర్శించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నదీ జలాల పంపకాలు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు-నిజాలు కార్యక్రమంలో కేసీఆర్, హరీశ్ రావులపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణకు ఎంత మేలు చేశారో, కృష్ణా జలాల పునఃపంపిణీ సాధించి అంతే మేలు చేశారని, ఆయనను విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేయడమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించబోమని చెబుతూనే, మరోవైపు ఆయనను ముంబై ఉగ్రవాది కసబ్‌తో పోల్చడం రేవంత్ రెడ్డి సంస్కారహీనతకు నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు.ప్రాణాలకు తెగించి, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన మహనీయుడు కేసీఆర్. అలాంటి వ్యక్తిని కసబ్‌తో పోల్చిన మీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం తెలుసా మీకు తెలిసిందల్లా అనాగరిక భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగాలే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను, తనను ఉరితీయాలని, రాళ్లతో కొట్టాలని వ్యాఖ్యలు చేస్తూనే, మర్యాద పాటిస్తానని సుద్దులు చెప్పడం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఆవు తోలు కప్పుకున్న తోడేలు మీరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జలవివాదాలపై అబద్ధాల ప్రచారం కృష్ణా జలాల్లో కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని, అది పచ్చి అబద్ధమని హరీశ్ రావు కొట్టిపారేశారు.కేసీఆర్ గారు 299 టీఎంసీలకు ఒప్పుకుంటే, రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారు ఆనాడు మొత్తం నీటిలో 69 శాతం వాటా తెలంగాణకు దక్కాలని కేసీఆర్ డిమాండ్ చేసిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లారని, బ్రిజేష్ ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని 28 లేఖలు రాసి, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసిన ఘనత కేసీఆర్‌దని గుర్తు చేశారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతోనే సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకున్న నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశపు మినిట్స్‌ను ప్రదర్శిస్తూ, వాటిని చదువుకోవాలని రేవంత్‌కు సవాల్ విసిరారు.