|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 02:45 PM
పోలవరం-నల్లమలసాగర్ ప్రి ఫీజిబిలిటీ రిపోర్ట్‌కు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఇంకా ఎలాంటి ఆమోదం తెలపలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో హరీశ్ రావు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం మాజీ మంత్రికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడదని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బనకచర్ల ద్వారా ఏపీకి అక్రమంగా నీటి తరలింపును అడ్డుకునేందుకు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేంటని నాడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. గత పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలు సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందన్న వార్తల్లో నిజం లేదని ఆయన వివరించారు. సీడబ్ల్యూసీ వ్యక్తం చేసిన సాంకేతిక అభ్యంతరాల కారణంగానే మొదటి విడతలో 45 టీఎంసీల అనుమతి కోరామని స్పష్టం చేశారు. రెండో విడతలో మరో 45 టీఎంసీల నీటిని కేటాయించాలని ఇప్పటికే కేంద్రానికి అధికారికంగా లేఖ రాశామని, మొత్తం 90 టీఎంసీల లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని హరీశ్ రావుకు హితవు పలికారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.