|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:09 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయనేనని ఘాటుగా విమర్శించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నదీ జలాల పంపకాలు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు-నిజాలు కార్యక్రమంలో కేసీఆర్, హరీశ్ రావులపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణకు ఎంత మేలు చేశారో, కృష్ణా జలాల పునఃపంపిణీ సాధించి అంతే మేలు చేశారని, ఆయనను విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేయడమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.