|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 07:14 PM
తెలంగాణలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగ లోపే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ' రైతు భరోసా ' నిధులను జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఈసారి గతానికి భిన్నంగా.. కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి. ఈ వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 'సింథటిక్ ఎపర్చర్ రాడార్' శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ శాటిలైట్ సర్వే సత్ఫలితాలను ఇవ్వడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీని ఆధారంగానే అనర్హులను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు ఈ నివేదికల ఆధారంగా నిజమైన రైతులను గుర్తిస్తున్నారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశం ఉంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ యాసంగి సీజన్‌లో సుమారు కోటిన్నర ఎకరాలకు ఈ పథకం వర్తించనుండగా.. దీనికోసం సుమారు రూ. 9, వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. గత వానకాలం సీజన్‌లో 69.40 లక్షల మంది రైతులకు రూ. 8,744 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈసారి నిబంధనల కఠినత వల్ల లబ్ధిదారుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని భావిస్తోంది.
ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. సంక్రాంతి నాటికి రైతుల చేతికి డబ్బులు అందితే పండుగ సంబరాలు రెట్టింపు అవ్వడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం వస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. రుణమాఫీ తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక సాయం కోసం తెలంగాణ రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత డేటాతో పారదర్శకత పెరగడమే కాకుండా.. ప్రజాధనం వృథా కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది.