|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:13 PM
తెలంగాణ శాసనమండలిలో చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆటో డ్రైవర్ల పక్షాన గళం విప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత బస్సు పథకం వల్ల మహిళా ప్రయాణికులందరూ ఆర్టీసీ వైపు మళ్లారని, దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు వినూత్నమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ఆర్టీసీ బస్సులు కేవలం ప్రధాన రహదారులకే పరిమితం అవుతాయని.. కానీ ఆటోలు రాష్ట్రంలోని ప్రతి గల్లీకి వెళ్తాయని మల్లన్న గుర్తు చేశారు.
'మహాలక్ష్ములను (మహిళలను) వారి ఇంటి గడప నుంచే గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఆటోలకే ఉంది. కాబట్టి, బస్సుల్లో మాదిరిగానే ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. దీనికి అయ్యే ఛార్జీలను ప్రభుత్వం నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయాలి' అని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల మహిళలకు ప్రయాణం మరింత సులభతరం కావడమే కాకుండా.. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలు ఆటో డ్రైవర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయని మల్లన్న విమర్శించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే స్వయంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే యాప్ వల్ల డ్రైవర్లకు కమీషన్ల భారం తగ్గుతుందని ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందుతాయని వివరించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ఆయన సభ దృష్టికి తెచ్చారు.
ట్రాఫిక్ నిబంధనల పేరుతో డ్రైవర్లపై భారీగా చలాన్లు విధిస్తున్నారని, వారు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు చలాన్లకే సరిపోతోందని తెలిపారు. ఈ పెండింగ్ చలాన్లను ఒకసారి మాఫీ చేసి వారిని ఆదుకోవాలని కోరారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల నుంచి దాడులు, వేధింపులు ఎదురవుతున్నాయని, దీనిపై పునఃసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లపై ఉన్న కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలను సరళీకృతం చేయాలని, తద్వారా వారు ప్రశాంతంగా వృత్తిని కొనసాగించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మండలిలో మల్లన్న చేసిన ఈ ప్రతిపాదనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.