|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:29 PM
కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కలుషిత నీరు ఫిర్యాదులను 'జీరో'కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే, ఎం సీ సీ కి అందే కలుషిత నీరు ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయో, తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే.. డివిజన్ వారీగా కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు, కలుషిత నీరు నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైపు లైన్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీటితోపాటు, కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలని అధికారులను కోరారు. దానికి సంబంచిన కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు.
ఇప్పటికే కలుషిత నీరు కనిపెట్టేందుకు.. జలమండలి ఇప్పటికే కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి జలమండలి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్బంగా ఎండీ వివరించారు. దీన్ని పైప్ ఇన్ స్పెక్షన్ కెమెరా సిస్టం అని కూడా అంటారని దీని ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరిస్తామని అని చెప్పారు.