|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 05:54 PM
సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. నగరాల్లో బతుకుదెరువు కోసం స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యే సమయం. అయితే.. ఈ పండుగ ఆనందం కంటే ప్రయాణ కష్టాలే ప్రయాణికులను ఎక్కువగా కలవరపెడుతున్నాయి. అప్పుడే టికెట్ల వేట మొదలు కాగా.. పరిస్థితి చూస్తుంటే సామాన్యుడికి సొంత ఊరు వెళ్లడం గగనంగా మారుతోంది.
పండుగకు నెల రోజుల ముందే రైలు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. స్లీపర్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు ఏ ట్రైన్ చూసినా 'రిగ్రెట్' అనే బోర్డే కనిపిస్తోంది. ఇక ఆఖరి నిమిషంలో తత్కాల్‌పై ఆశలు పెట్టుకుంటే.. అది కత్తి మీద సాములా మారింది. సరిగ్గా టికెట్లు బుక్ చేసే సమయానికి IRCTC సర్వర్లు మొరాయించడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం సామాన్యమైపోయింది. మరోవైపు ఆర్టీసీ నడిపే ముందస్తు రిజర్వేషన్ బస్సులు కూడా ఇప్పటికే నిండిపోయాయి. అదనపు బస్సులు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పెరిగిన రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు.
ప్రభుత్వ రవాణా వ్యవస్థలు చేతులెత్తేయడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పంజా విసురుతున్నాయి. డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి విజయవాడకు రూ. 700 ఉండే టికెట్ ధర.. ప్రస్తుతం రూ. 2,700 నుండి రూ. 4 వేల వరకు పలుకుతోంది. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కో సీటుకు రూ. 5 వేలకు పైనే వసూలు చేస్తున్నారు. నలుగురు సభ్యులున్న ఒక మధ్యతరగతి కుటుంబం ఊరెళ్లాలంటే కేవలం ప్రయాణానికే రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పండుగ కోసం దాచుకున్న సంపాదన అంతా ప్రయాణాలకే ధారపోయాల్సి వస్తోందని సామాన్యులు కన్నీరు పెడుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నా.. రవాణా శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమాన ప్రయాణ ఛార్జీలతో పోటీ పడుతున్న బస్సు రేట్లకు ఒక గరిష్ఠ పరిమితిని విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేట్ బస్సు ఛార్జీలపై ప్రభుత్వం తక్షణమే నియంత్రణ తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే శాఖ మరిన్ని జన్ సాధారణ్ లేదా ప్రత్యేక అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడపాలని అంటున్నారు. ముఖ్యమైన జంక్షన్ల వద్ద రవాణా శాఖ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి.. అధిక వసూళ్లకు పాల్పడే బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పండుగ అంటే కుటుంబంతో గడిపే సమయం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది కేవలం సంపన్నులకే సాధ్యమయ్యేలా కనిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రయాణికులకు భరోసా ఇవ్వాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.