|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:23 PM
ఇప్పటి వరకు ట్రాఫిక్ కష్టాలతో సతమతమైన హైదరాబాద్ నగరవాసులకు ఇప్పుడు 'వాయు గండం' పొంచి ఉంది. దేశ రాజధాని దిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కూడా గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ముఖ్యంగా కొత్త ఏడాది తొలిరోజున నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ ఏకంగా 300 మార్కును తాకడం పర్యావరణవేత్తలను, ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది.
గాలి నాణ్యత ప్రధానంగా మూడు రకాలుగా తగ్గుతుంది. గాలిలో తేమ, బ్యాక్టీరియా, చెత్త నుంచి వచ్చే దుర్వాసనలను బయో రియాక్టివ్‌లు అంటారు. సూక్ష్మ ధూళి కణాలను ఫిజికల్ రియాక్టివ్‌లు, కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, బెంజిన్ వంటి ప్రమాదకర వాయువులను కెమికల్ రియాక్టివ్‌లు అంటారు. వీటి ద్వారా నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. నగరంలో 80 లక్షల వాహనాలు ఉండగా.. దాదాపు 50 లక్షల వాహనాలు ప్రతి నిత్యం రోడ్డెక్కుతున్నాయి. వీటితో పాటు భవన నిర్మాణాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ముఖ్యంగా కేపీహెచ్‌బీ వంటి రద్దీ ప్రాంతాల్లో AQI 302గా నమోదు కావడం గమనార్హం.
వాయు నాణ్యత సూచీ 100 దాటితేనే ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అది 300కు చేరితే.. ఆ గాలిని పీల్చడం అంటే రోజుకు 30 నుంచి 35 సిగరెట్లు తాగినంత ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అయితే నగరంలో గాలి నాణ్యతను కొలిచే విషయంలో ప్రభుత్వ అధికారిక లెక్కలకు, థర్డ్ పార్టీ యాప్‌లకు మధ్య పొంతన లేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) లెక్కల ప్రకారం జనవరి 1న గరిష్ఠ ఏక్యూఐ 170గా నమోదైతే.. గూగుల్ యాప్, ఇతర థర్డ్ పార్టీ పరికరాలు మాత్రం అది 300 దాటినట్లు చూపిస్తున్నాయి.
డిసెంబరు నెలలో కూడా ఇదే వ్యత్యాసం కనిపించింది. పీసీబీ లెక్కల్లో 132గా ఉన్న సూచీ.. బయట యాప్‌లలో 270 వరకు దర్శనమిచ్చింది. ఈ వ్యత్యాసంపై శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఆధునిక పరికరాల ధర సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని, ప్రస్తుత ప్రభుత్వ యంత్రాలు ఆ స్థాయిలో కచ్చితత్వాన్ని కలిగి లేవని విశ్రాంత ఆచార్యులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల్లో పారదర్శకత పెరగకపోవటంతో పాటు, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌లో సాధారణ జీవనం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో బతకటం కూడా కష్టమేనని అంటున్నారు.