![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 07:50 PM
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. శనివారం ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ లో రెండు ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. భూమిని అప్పగించిన నాగార్జున రియల్ హీరో అని కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, ట్యోక్యో వంటి నగరాలతో పోటీ పడేలా చేయాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. ఈ యజ్ఞానికి ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా చేసి తీరుతామని ప్రకటించారు. తమ ప్రభుత్వ ప్రయత్నానికి జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు అండగా నిలిచేందుకు ముందుకువచ్చారని.. మీరే ఈ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మా ప్రభుత్వానికి ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. మిగతా సమయాల్లో ప్రజల అభివృద్ధే బాధ్యతగా భావిస్తున్నామన్నారు. మూడు లేయర్లుగా తెలంగాణను విభజిస్తున్నాం. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్భన్ రీజన్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఒక ప్రణాళిక లేకపోవడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి పాఠాలు నేర్చుకుని మనం ఒక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను ప్రజలు గమనించాలని.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.
Latest News