వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి : ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా ప్లాన్-ఏ, బీ, సీ విధానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నీటి సమస్య ఉన్న గ్రామాలు, ఆవాసాలను గుర్తించి పాత బోర్లకు మరమ్మతులు చేయడం, అవసరమైన చోట కొత్త బోర్లు వేయడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల వివరాలతో వచ్చే వారం సమీక్షకు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు.
వీబీ-జీ రామ్ జీ పథకం కింద కూలీలకు గరిష్ఠంగా ఉపాధి కల్పించాలని, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పెండింగ్ పనులను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులను గుర్తించి పశుగ్రాస సాగుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.
మంజూరైన గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రబీ సీజన్‌లో రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకునేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పంటకు 90 నుంచి 120 రోజుల వరకు అవసరమైన నీటి లభ్యతను ముందుగానే అంచనా వేయాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ వంటి ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీలత, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి -మేజర్ న్యూస్