సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం
తిరుపతి సిటీ మేజర్ న్యూస్ :
మీడియా వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడానికి ముందు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని, సంచలనాలకు కాకుండా సామాజిక ప్రయోజనాలకు, ప్రాధాన్యత ఇవ్వాలని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ గూడారు జగదీష్ సూచించారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ , తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ,
పత్రికా స్వేచ్ఛ కేవలం వార్తలను ప్రచురించే హక్కు మాత్రమే కాదని, వాస్తవాలను నిర్భయంగా, నిష్పాక్షికంగా ప్రజలకు తెలియజేసే బాధ్యత కూడా అని అన్నారు.
ఒక ఆసుపత్రిలో ఎంత అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, వాటి గురించి పేద ప్రజలకు తెలియకపోతే ఆ సేవల పూర్తి ప్రయోజనం వారికి అందదని పేర్కొన్నారు. అందుకే స్విమ్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత వైద్య సేవలను ప్రజలకు చేరవేయడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించేందుకు పాత్రికేయులు కృషి చేయాలని కోరారు.
ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా సమాచారం క్షణాల్లో లక్షలాది మందికి చేరుతోందన్నారు. అయితే అందులోని ప్రతి సమాచారం వాస్తవం కాదని గుర్తించాలన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు సాయంతో రూపొందిస్తున్న నకిలీ చిత్రాలు, వీడియోలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించడంలో పాత్రికేయులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్ధారణ లేని వార్తల ప్రచారం వల్ల వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలగడమే కాకుండా సమాజంలో అపోహలు, భయాందోళనలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. పత్రికా రంగంలో వృత్తి నైతికత, నిజాయితీ, నిష్పాక్షికత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాన్య ప్రజల గొంతుకగా నిలవడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం పాత్రికేయుల ప్రధాన బాధ్యతలని వివరించారు.
ప్రజారోగ్యానికి సంబంధించిన వార్తలు, వైద్య సమాచారం విషయంలో మీడియా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జగదీష్ సూచించారు. వైద్యపరమైన ఆధారాలు లేని చికిత్సా విధానాలు, మందులు, ఆరోగ్య సూచనలను ప్రచారం చేయడం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వైద్య నిపుణుల అభిప్రాయాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ప్రజలకు సరైన ఆరోగ్య సమాచారాన్ని అందించాలని తెలిపారు.
ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే వాటిని మీడియా నిర్మాణాత్మకంగా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సరిదిద్దుకుని వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి బర్డ్ , స్విమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అదే సమయంలో పేద ప్రజల ప్రయోజనం కోసం చేపడుతున్న మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయాలని పాత్రికేయులను కోరారు.
ఒక మంచి వార్తా కథనం పేద రోగికి ప్రాణదానం చేయగలదని, ఒక సరైన సమాచారం దివ్యాంగుడికి కొత్త జీవితాన్ని అందించగలదని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించడం వైద్య సంస్థల బాధ్యత అయితే, ఆ సేవలు అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా సహకారం ఎంతో విలువైనదని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన, పేదల సంక్షేమానికి ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వైద్య సంస్థలు, మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైద్యుడు రోగికి చికిత్స అందిస్తాడని , పాత్రికేయుడు సమాజానికి చైతన్యం అందిస్తాడని చెప్పారు . ఈ ఇద్దరి సేవల అంతిమ లక్ష్యం మానవ సంక్షేమమే అని పేర్కొంటూ, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన వక్త యస్.వి.యూనివర్సిటీ న్యాయవిభాగం అసోసియేట్ ప్రొఫెసర్
డాక్టర్ జి. ఆదినారాయణ మాట్లాడుతూ, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్ట్ లు సాంకేతిక నైపుణ్యతను అలవరుచుకోవాలని అన్నారు. జర్నలిజం వృత్తి ఎంతో పవిత్రమైనదని, జర్నలిస్ట్ విస్వనీయత ఆధారంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి. శ్రీధరన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నామా .వరదరాజులు, టి.జనార్ధన్ , సీనియర్ జర్నలిస్ట్ లు ఎస్.నగేష్,ఆర్ రాజేంద్ర, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్.మురళి , కార్యదర్శి పి.బాలచంద్ర, సీనియర్ పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.