సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు!
సూర్య నేషనల్ డెస్క్ (గాంధీనగర్): గుజరాత్‌లోని అంబార్డి సఫారీ పార్క్ లో సింహాన్ని బైకులపై వెంబడిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినముగ్గురు కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
అయితే, సిబ్బంది సింహాన్ని కావాలని వేధించారనే ఆరోపణలను అటవీ శాఖ ఉన్నతాధికారులు ఖండించారు. దీపావళి సెలవుల సమయంలో సఫారీ పార్కుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారని, ఆ సమయంలో తన ఎన్‌క్లోజర్ నుండి బయటకు వచ్చిన సింహాన్ని తిరిగి సురక్షితంగా లోపలికి పంపేందుకే సిబ్బంది ఆ ప్రయత్నం చేశారని అధికారులు వివరణ ఇచ్చారు.
పర్యాటకుల భద్రత దృష్ట్యా సింహాన్ని దారి మళ్లించే క్రమంలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా బైకులతో దానిని వెంబడించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వన్యప్రాణుల సంరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు గాను సదరు ముగ్గురు సిబ్బందిపై వేటు వేసినట్లు అటవీ శాఖ స్పష్టం చేసింది.