ఏపీ వచ్చే పదేళ్లలో నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుంది
అమరావతి/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. గతంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థవంతంగా గాడిలో పెట్టారని ఆయన కొనియాడారు. ఇదే వేగం కొనసాగితే వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో నక్సలిజం నిర్మూలన అనేది మనందరి ఉమ్మడి విజయమని పేర్కొన్న అమిత్ షా, ఏపీ ప్రగతిపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 30 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయని, రాష్ట్రంలో భారీ స్టీల్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అలాగే, విశాఖపట్నంలో గూగుల్ ఏఐ (AI) హబ్ ఏర్పాటు కావడం ఒక్క ఏపీకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు.
మరోవైపు, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు. పోలవరం నిర్మాణంతో రాష్ట్ర రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.