ఎరువులు కొనుగోలు డిజిటల్ విధానం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరైతులకు ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సులభతరంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ విధానంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి పి.వి.శ్రీనివాస్ సూచించారు.
ఈ విధానం ద్వారా రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా మొబైల్ ఫోన్ ద్వారా ముందుగానే ఎరువులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రైతుల భూమి వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాల ఆధారంగా ఎరువుల అవసరాన్ని గుర్తించి సంకేత సంఖ్యను కేటాయిస్తారని పేర్కొన్నారు.
ఆ సంకేత సంఖ్య ఆధారంగా సంబంధిత ఎరువుల విక్రయ కేంద్రాల్లో రైతులు ఎరువులను పొందవచ్చని వివరించారు. దీనివల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు, రైతులకు సకాలంలో ఎరువులు అందే అవకాశం ఉంటుందన్నారు.
రైతులు తమ రైతు గుర్తింపు సంఖ్య, భూమి వివరాలు, పంట సాగు వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విధానంపై సందేహాలు ఉన్నవారు సమీప రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు లేదా అధీకృత ఎరువుల విక్రయ కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని మండల వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.