పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు కార్యక్రమాన్ని బిక్కవోలు మండలం కొంకుదురు శాఖా గ్రంథాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమానికి విశేష సేవలందించి, గ్రంథాలయాల స్థాపనకు కృషి చేసిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, మంతెన సూర్యనారాయణమూర్తి, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రి, సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ తదితర గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వారి త్యాగం, నిరంతర కృషి ఫలితంగానే నేడు సమాజంలో గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ పాఠకుడు ఎస్. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయ ఉద్యమానికి పునాదులు వేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే అభిలాషను విద్యార్థుల్లో పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ వారోత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచే వేదికలుగా నిలవాలని అన్నారు.గ్రంథాలయ అధికారి ఎన్. బాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.