ప్లీజ్ సాయంత్రం ఆపండి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
రాజమండ్రి నగర వీధులు ఇసుక లారీల దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పగలంతా నగర రోడ్లపై హడావుడి సృష్టిస్తున్న భారీ ఇసుక లారీలు.. రాత్రి వేళల్లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. నిబంధనలు, ప్రజల ఇబ్బందులు తమకు పట్టనట్టుగా రాత్రీ పగలూ రోడ్లపై యథేచ్ఛగా దూసుకుపోతున్నాయి. ఫలితంగా నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు, ఇసుక దుమ్ము, ప్రమాదాల భయం నిత్యకృత్యంగా మారాయి.
రాజమండ్రి గాయత్రీ ఇసుక ర్యాంపు నుంచి బాలాజీపేట మీదుగా హైవేకు చేరాల్సిన ఇసుక లారీలు.. రాజమండ్రి త్రీ టౌన్ పరిధిలోని రహదారులపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. లారీల వెనుక నుంచి ఎగసిపడుతున్న ఇసుక దుమ్ము వాహనదారుల కళ్లల్లో పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీ వాహనాల రాకపోకలతో రహదారులపై ట్రాఫిక్ క్రమంగా అస్తవ్యస్తమవుతోంది.
ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగర వీధుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు చేరుకునే వారు, ద్విచక్ర వాహనదారులు, పిల్లలతో బయటకు వచ్చే కుటుంబాలు ఈ సమయంలో రోడ్లపై ఎక్కువగా ఉంటారు. ఇలాంటి రద్దీ వేళల్లో భారీ ఇసుక లారీలను కూడా యథేచ్ఛగా అనుమతించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది.
ఒకవైపు లారీల నుంచి ఎగిసిపడే ఇసుక దుమ్ము.. మరోవైపు భారీ వాహనాల కారణంగా నిలిచిపోయే ట్రాఫిక్.. ఇంకోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రహదారులు. ఈ మూడు సమస్యలు కలిసి నగర ప్రజల ప్రయాణాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇసుక దుమ్ముతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కళ్లల్లో ఇసుక పడితే వాహనంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
పగటిపూట రాకపోకలు తప్పనిసరి అయితే.. కనీసం సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అయినా ఇసుక లారీల రాకపోకలను నియంత్రించలేరా? ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ఐదు గంటల సమయంలో భారీ వాహనాలకు విరామం కల్పిస్తే నగర ట్రాఫిక్‌కు కొంతైనా ఉపశమనం లభిస్తుంది. ప్రజల భద్రతకు కూడా భరోసా ఉంటుంది.
ఇసుక రవాణా ప్రభుత్వ అవసరాలకు, నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యవహారమే కావచ్చు. కానీ ఆ పేరుతో నగర ప్రజల ప్రశాంతమైన ప్రయాణాన్ని, భద్రతను పణంగా పెట్టడం ఎంతవరకు సమర్థనీయం? ఇసుక రవాణా ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, రహదారి భద్రత కూడా అంతే ముఖ్యం.
అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. త్రీ టౌన్ పరిధిలో ఇసుక లారీల రాకపోకలపై కఠిన నియంత్రణ విధించాలి. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ ఇసుక లారీలకు అనుమతి లేకుండా చర్యలు తీసుకోవాలి. లారీల నుంచి ఇసుక రోడ్డుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.